బాలీవుడ్ సూపర్ స్టార్‌లలో సల్మాన్ ఖాన్. అతడిని చూస్తే కండలతో పటిష్టంగా కనిపిస్తాడు. మాట తీరు కూడా చురుగ్గా ఉంటుంది. టీవీ షోలలో తన మాటలతోనే అలరిస్తాడు. చురుకైన చూపుతో కనిపిస్తాడు. అతడు చూస్తే ఏ ఆరోగ్య సమస్య లేదనిపిస్తుంది. కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వ్యాధులతో బాధపడుతున్నాడు. సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
సల్మాన్ ఖాన్ చెబుతున్న ప్రకారం అతనికి బ్రెయిన్ అనూరిజం, ట్రెజైమినల్ న్యూరాల్జియా, AV మాల్‌ఫార్మేషన్ వంటి వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులతో అతడు పోరాడుతూనే జీవనం సాగిస్తూ వస్తున్నాడు.
మెదడు అనూరిజం అంటే..
బ్రెయిన్ అనూరిజం అనేది పెద్ద సమస్యగానే చెప్పుకోవాలి. మెదడులో ఉన్న రక్తనాళాల్లో బెలూన్ లాంటి వాపు వస్తుంది. దీన్నే సెరిబ్రెల్ అనూరిజం అని కూడా అంటారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మెదడు అనూరిజం వల్ల మెదడు నరాలలోని కొన్ని భాగాల్లో రక్త పీడనం పెరిగిపోతుంది. చాలాసార్లు వాటి నుండి అంతర్గత రక్తస్రావం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు బ్రెయిన్ హేమరేజ్ వంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. బ్రెయిన్ అనూరిజం ఉన్న వారిలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. వాంతులు, తల తిరగడం, కాంతిని తట్టుకోలేకపోవడం, దృష్టి మసకబారడం, మెడ పట్టేసినట్టు అవ్వడం, మూర్ఛలు రావడం, కనురెప్పలు పడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీనికి నిత్యం చికిత్సలు తీసుకోవాల్సిందే.
ట్రైజెమినల్ న్యూరాల్జియా
ట్రైజెమినల్ అనేది మన శరీరంలో ఉండే ఒక నాడి. ఇది ముఖం నుండి మెదడు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. ముఖం నుండి మెదడుకు నొప్పి, స్పర్శ, ఉష్ణోగ్రత వంటి అనుభూతులను పంపించే నాడి ఇదే. ట్రైజెమినల్ నాడిపై ఒత్తిడి పడితే అది దెబ్బ తినడం ప్రారంభిస్తుంది. అప్పుడే ట్రైజెమినల్ న్యూరాల్జియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధి వల్ల ముఖంపై తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. కనీసం నోట్లో దంతాలను కూడా శుభ్రం చేసుకోలేరు. ముఖంపై ఉన్న చర్మం చాలా సున్నితంగా మారుతుంది. ఆ చర్మాన్ని తాకితే చాలు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా సాగే సమస్య ఇది. ఎందుకు వస్తుందో కారణం మాత్రం ఎప్పటి వరకు తెలియలేదు.
AV మాల్‌ఫార్మేషన్
దీన్ని AVM అని పిలుచుకుంటారు. అంటే ఆర్తెరియోవీనస్ మాల్‌ఫార్మేషన్. ఇది కూడా మెదడుకే వచ్చే వ్యాధి. ఈ స్థితిలో మెదడులోని ధమనులు, సిరలు వేరువేరుగా ఉండకుండా ఒకదానితో ఒకటి చిక్కు పెడతాయి. ఇది మెదడులో రక్తం ఆక్సిజన్ ప్రసరణను ప్రభావితం చేస్తుంది. మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో దీనికి శస్త్ర చికిత్స కూడా అవసరం పడుతుంది.
పైన చెప్పిన మూడు ఆరోగ్య సమస్యలు నిజానికి తీవ్రమైనవే. సల్మాన్ ఖాన్ వీటికి ఎన్నోసార్లు చికిత్స తీసుకొని మందులు వాడుతూనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.