ఏడుపు అనేది ఒక భావోద్వేగం. మనసులో ఉన్న బాధ బయటికి పోవాలంటే ఎంతోమంది చేసే పని ఏడుపు. కానీ ఆ ఏడుపు అతిగా మారితే మాత్రం మానసిక సమస్యలకు కారణం అవుతుంది. అంతేకాదు చర్మ సమస్యలు కూడా వస్తాయట. అతిగా ఏడ్చేవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ అని వాదనలు వినిపిస్తున్నాయి.
మొటిమలు ఏ వయసులో వారిలోనైనా కనిపించే చర్మ సమస్య. దీనికి ఒత్తిడి, ఆహారం, హార్మోన్ల అసమతుల్యత, చర్మ సంరక్షణ సరిగా లేకపోవడం వంటివి కారణాలుగా ఉంటాయి. అయితే అతిగా ఏడవడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉందని కొన్నిచోట్ల వాదన వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
ఏడుపు వల్ల మొటిమలు వస్తాయా?
సైన్స్ చెబుతున్న ప్రకారం అతిగా ఏడవడం వల్ల మొటిమలు రావు. అయితే ఏడుపు అనేది మొటిమలు రావడానికి పరోక్ష కారణంగా మాత్రం మారుతుంది. ఏడుపు చర్మ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి మొటిమల సమస్యను తెస్తుంది. అంటే ఏడుపు మొటిమలు రావడానికి ప్రత్యక్షంగా కారణం కాకపోయినా పరోక్షంగా మాత్రం ఒక కారణంగానే చెప్పుకోవాలి.
ఏడుపు అనేది ఎప్పుడు వస్తుంది? తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, భావోద్వేగపరంగా దిగాలు పడినప్పుడు వస్తుంది. అలాగే ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి వల్ల కూడా ఏడుపు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులను వీడి వెళుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. అలాగే పనులు చేయలేక ఆఫీసులో కూడా ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో శరీరంలో కార్టిసాల్ అని పిలిచే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్లు చర్మంలో సెబమ్ అని పిలిచే నూనె ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. అంటే ఏడుపు నేరుగా మొటిమలకు కారణం కాకపోయినా పరోక్షంగా ఒత్తిడి ద్వారా మొటిమలను ప్రేరేపిస్తుంది.
అలాగే ఏడుస్తున్నప్పుడు ఎంతోమంది ముఖాన్ని తుడుచుకుంటూ ఉంటారు. అలాగే గట్టిగా రుద్దుతూ ఉంటారు. చేతులపై ఉన్న బ్యాక్టీరియా, మురికి, నూనె ఇవన్నీ కూడా ముఖానికి అతుక్కుంటాయి. సెన్సిటివ్‌గా ఉండే చర్మం పైన ఉన్న రంధ్రాలు మూసుకునేలా చేస్తాయి. దీని వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కాబట్టి ఏడ్చినప్పుడు పదేపదే చేతులతో ముఖాన్ని రుద్దుకోవడం మానేయండి.
భావోద్వేగాలు ఎక్కువైతే ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి వల్ల నిద్ర తగ్గిపోతుంది. ఆహారపు అలవాట్లు కూడా మారిపోతాయి. ఒత్తిడిలో కొందరు చక్కెర, నూనె నిండిన ఆహారాలను అధికంగా తింటారు. ఇవి కూడా మొటిమలకు కారణం అవుతాయి.
కన్నీళ్లు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు విపరీతంగా చెంపలపై జారుతాయి. కన్నీళ్ళలో ఉప్పు అధికంగా ఉంటుంది. అది చర్మంపై జారుతున్నప్పుడు చికాకుగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం పొడిబారినట్టు అవుతుంది. ఒక్కొక్కసారి చర్మంపై ఎరుపుదనం, ఇన్ప్లమేషన్ వంటివి కూడా వస్తాయి. ఇవి కూడా మొటిమలకు కారణం అవుతాయి. అయితే ఇవి చాలా అరుదైన సందర్భంలోనే జరుగుతుంది.
పైన చెప్పిన కారణాలను వింటే ఏడుపు మొటిమలకు కారణమవుతుందని అర్థమవుతుంది. నేరుగా కారణం కాకపోయినా ఏదో ఒక రకంగా ఏడుపు మొటిమలను పెంచుతుంది. కాబట్టి ఏడుపును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
సరైన ఫేస్‌వాష్ వాడడం, మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల కూడా మొటిమలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. అలాగే చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కొందరికి మొటిమలు వంశపారంపర్యంగా వస్తాయి. అలాంటివి వాటిని తగ్గించడం కొంచెం కష్టమే.
Also Read: హెయిర్ స్పా అంటే ఏమిటీ? జుట్టు రాలే సమస్యలను ఆపుతుందా? అబ్బాయిలూ చేయించుకోవచ్చా?
ఏడుపు రాకుండా ఉండాలంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచాలి. దీని కోసం యోగా, మెడిటేషన్ వంటివి నేర్చుకోవాలి. భావోద్వేగ క్షణాల్లో ఏడవడం సహజమే. కానీ అది అతిగా ఉంటే మాత్రం ఇతర మానసిక సమస్యలు వస్తాయి.
చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో మీరు మొటిమలు రాకుండా జాగ్రత్త పడవచ్చు అలాగే ఆహారంలో చక్కెర, నూనె ఉండే పదార్థాలను తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకోవాలి. రోజు ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవడం చాలా అవసరం.