మనిషికి శునకాలకు మధ్య అనుబంధం ఎక్కువ. ఇతర జంతువులతో పోలిస్తే మనిషి ఎక్కువగా దగ్గరయింది కుక్కలకే. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక పెంపుడు కుక్క కనిపిస్తోంది. మన దేశంలో పెంపుడు కుక్కలు పెంచుకునే వారి సంఖ్య సాధారణంగానే ఉంటుంది… కానీ అమెరికాలో మాత్రం ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు కుక్కలు ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో అయితే మనుషులు కన్నా కుక్కల సంఖ్య అధికం. అంతగా పెంపుడు జంతువుగా శునకం మనకి దగ్గరయిపోయింది.
కుక్కకు కలలు వస్తాయా?
మనిషికి కలలు వస్తున్నట్టే కుక్కలకు కూడా కలలు వస్తాయి. కలలు కనడం అనేది మనిషికి మాత్రమే సొంతమైన విద్య కాదు. కుక్కలకు కూడా ఆ విద్య తెలుసు. జంతువుల మర్మమైన కలల ప్రపంచం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మనలాగే కుక్కలు కూడా అనేక రకాల కలలను అనుభవిస్తాయని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పుడు లభించాయి. వాటికి కూడా సంతోషకరమైన కలలు, పీడకలలు, చెడు కలలు ఇలా రకరకాలుగా వస్తాయి. అవి సంతోషకరమైన కలలు వస్తే విశ్రాంతిగా ఉంటాయి. అదే చెడు కలలు వస్తే అసౌకర్యానికి గురవుతాయి. భయం వేస్తే అరుస్తాయి కూడా. కాబట్టి నిద్రపోతున్న కుక్కను మీరు ముద్దు పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మంచి కలలు వస్తున్న కాలం అయితే మీ కుక్క మిమ్మల్ని ఏమీ అనదు. అదే పీడకల వస్తే ఆ భయంతో మిమ్మల్ని కరిచేసే అవకాశం ఉంది.
2001లో మసాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేసిన అధ్యయనంలో జంతువులు కూడా మనుషుల మాదిరిగానే కలలు కంటాయని… అవి నిజజీవిత అనుభవాలతో ముడిపడి ఉంటాయని కనుగొన్నారు. ఈ అధ్యయనం మొదటి ఎలుకలపై జరిగింది. వాటి మెదడులోని కార్యకలాపాలు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నాయో నమోదు చేశారు. అందులో రోజువారీ తమ జీవితంలో జరిగే సంఘటనలతో కలలకు దగ్గర సంబంధం ఉన్నట్టు కనుగొన్నారు.
శునకాలకు ఎలాంటి కలలు వస్తాయి?
కుక్కలకు కూడా మనలాగే ఎన్నో రకాల కలలు వస్తాయి. ముఖ్యంగా వాటికి ఇష్టమైన ఆహారం గురించి, అవి ఆడుకునే బొమ్మల గురించి కలలుకంటాయి. అలాగే తమ స్వేచ్ఛగా పరుగులెత్తినట్టు కలలు కంటాయి. ఎలుకలు, చుంచులు వెనక ఛేజ్ చేస్తున్నట్టు కూడా వాటి కలలో చూస్తాయి. అలాగే తమను ప్రేమగా పెంచే యజమానుల వెంట ఆనందంతో పరుగులు పెడుతున్నట్టు కూడా కలలు కంటాయి. ఇవే వాటికి ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే కలలు. కొన్ని కలలు మాత్రం వాటిని భయపెట్టే సంఘటనలు కనిపించవచ్చు. అప్పుడు మాత్రం అవి చాలా అసౌకర్యంగా ఉంటాయి. మేల్కొన్న తర్వాత కూడా అసహనంగా ఉంటాయి. ఆ సమయంలో వాటిని ఏమీ అనకూడదు.
కుక్కలు నిద్రలోకి జారుకోవడానికి కొంత సమయం పడుతుంది. వాటి అవి మొదట శ్వాసను లోతుగా తీసుకుంటాయి. వాటిలోని మానసికపరమైన ఆలోచనలు మందగిస్తాయి. కుక్క నిద్రపోయిన 20 నిమిషాల తర్వాతే వాటికి కలలు రావడం మొదలవుతాయి. కలలు వస్తున్నప్పుడు కుక్క తీసుకునే శ్వాస సక్రమంగా ఒక పద్ధతిలో ఉంటుంది. ఆ సమయంలో వాటి కనురెప్పల వెనక్కి ఉన్న కళ్ళు కదలడం ప్రారంభమవుతాయి. ఈ దశలో కుక్కలు బంతులతో ఆడుకోవడం, పిల్లిని వెంబడించడం లేదా వాటి యజమానులతో సమయం గడపడం వంటి కలలు కంటాయి. ముఖ్యంగా పగటిపూట అవి ఏవైతే అనుభవించాయో ఆ అనుభూతులనే కలల రూపంలో చూసే అవకాశం కూడా ఉంది.
చెడు కల వస్తే ఇలా
మీ కుక్క నిద్రపోతున్నప్పుడు గుర్రుమంటూ శబ్దం చేస్తే.. వాటికి పీడకల వస్తోందని అర్థం. వాటి శ్వాస కూడా సక్రమంగా ఉండదు. ఊపిరి ఆడనట్టు ఇబ్బంది పడతాయి. ఆ సమయంలో మీరు కుక్క దగ్గరికి వెళ్ళకండి. మీరు బాధలో ఉన్న కుక్కను ఓదార్చడానికి ముందుకు వెళ్ళవచ్చు .. కానీ ఆ సమయంలో అవి భయంతో కరిచే అవకాశం ఉంది. ఎంతో మంది యజమానులకు పెంపుడు కుక్కలు నిద్ర నుంచి లేచిన వెంటనే కరిచిన సందర్భాలు అధికంగా ఉన్నాయి.
పెద్ద సైజు కుక్కలతో పోలిస్తే చిన్న పరిమాణంలో ఉండే కుక్కలకు తరచుగా ఎక్కువ కలలు వస్తూ ఉంటాయని అధ్యయనం చెబుతుంది. అదే లాబ్రడార్ రిట్రీవర్ వంటి పెద్ద కుక్కలు గంటలో ఒక్క కలని మాత్రమే కనగలుస్తుంది.
పగటిపూట కుక్కలు ఏం చేస్తాయో… ఎంత బిజీగా ఉంటాయో దాన్నిబట్టే వాటి నిద్ర కూడా ఆధారపడి ఉంటుంది. రోజంతా చురుగ్గా ఆటలతో గడిపిన కుక్కకి నిద్ర అధికంగా పడుతుంది. ఆ మగత దశలోనే కలలు అధికంగా వస్తాయి. కుక్కలు ఎంత మత్తుగా నిద్రపోతే అంతగా కలలు వచ్చే అవకాశం పెరుగుతుంది.