Mango: వేసవి కాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తాయి. వీటిని తినేందుకు చిన్నా పెద్దా అంతా ఎంతో ఇష్టపడతారు. అయితే, కొనేటప్పుడు తాజా మామిడిని ఎంచుకోవడం చాలా అవసరం. మామిడికాయలు త్వరగా పండుగా మారాలని చాలా మంది వీటిలో కాల్షియం కార్బైడ్ అనే కెమికల్‌ను కలుపుతారు. ఇలా పండించిన మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనేటప్పుడే నాణ్యమైన వాటిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. మరి తాజా మామిడిని గుర్తించండం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కెమికల్ పండ్లను గుర్తించడం ఎలా?
మామిడి పండ్లను తీసుకునేటప్పుడు బాగా మక్కినవాటిని మాత్రమే ఎంచుకోవాలి. మరి ఈ పండ్లు సహజసిద్ధంగానే పండిందా లేదా కెమికల్స్ కలిపి పండించారా అనేది ఎలా తెలుసుకోవాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి ఒక సింపుల్ టిప్ తెలిస్తే సరిపోతుంది.
మామిడి పండును కెమికల్ ద్వారా పండిచారా లేదా సహజంగానే పండిందా అనేది తెలుసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో మామిడి పండును ఉంచాలి. సహజంగా పండిన మామిడి పండు నీళ్లలో మునిగిపోతుందట. అదే మామిడిపండు నీళ్లలో తేలితే దాన్ని కెమికల్స్ ద్వారా పండించినట్లు అర్థం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
తియ్యటి పండ్లు ఇలా ఉంటాయి..
మామిడిపండు తీసుకునే విషయంలో వాసన కూడా చాలా ముఖ్యం. తియ్యటి వాసన వచ్చే మామిడి పండు తాజాగా ఉందని అర్థం. అసలు ఏరకమై వాసన లేకపోతే లేదా చెడు వాసన వస్తే దాన్ని కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మామిడి ఒకే రకంగా కనిపించినా, రకాలు భిన్నంగా ఉంటాయి. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాలు రుచి, ఆకృతిలో తేడా ఉంటాయి. రుచికి తగ్గట్టుగా నచ్చిన వాటిని ఎంచుకోవాలి.
పండ్లు తీసుకునేటప్పుడు వాటి బరువును గమనించడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఉండే మామిడి పండ్లు చాలా బరువుగా ఉంటాయట. పాడైపోయిన మామిడి పండ్లు బరువు తక్కువగా ఉండడమే కాకుండా కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి.
మామిడిపండ్లను ఫ్రెష్‌గా ఉంచాలా?
మామిడిని ఎక్కువ రోజులు తాజాగా ఉంచాలంటే సరైన నిల్వ విధానం అవసరమని నిపుణులు చెబుతున్నారు. సహజంగా మామిడికాయలను పండ్లుగా మార్చాలంటే రూం టెంపరేచర్‌లో ఉంచాలట. అలాగే పేపర్ బ్యాగ్‌లో ఉంచితే త్వరగా పండిపోతాయట. ఇవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే గాలి తగలకుండా డబ్బాలో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో పెట్టడం మంచిది.
మామిడి తినడం వల్ల శరీరానికి విటమిన్-సి, విటమిన్-ఎ, ఫైబర్ లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తాయట. అంతేకాకుండా కంటి ఆరోగ్యాన్ని, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాడైన మామిడిపండ్లను తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. అందుకే తాజా మామిడిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.