Long Life Black Coffee| అందరూ ఎక్కువ కాలం జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం మంచి పోషకాహారం, వ్యాయమాలు చేస్తుంటారు. కానీ ఒక చిన్న అలవాటుతో కూడా ఆయుష్షు పెరుగుతుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది.
కొత్త అధ్యయనం ప్రకారం, రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల త్వరగా చనిపోయే రిస్క్ ని 14 శాతం వరకు తగ్గించవచ్చునని తేలింది. అయితే, కాఫీలో పాలు లేదా చక్కెర కలిపితే ఈ ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. అధిక మొత్తంలో చక్కెర లేదా కొవ్వు కలిపిన కాఫీలో ఇటువంటి ప్రయోజనాలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం ‘ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’ అనే పత్రికలో ప్రచురితమైంది.
అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఫాంగ్ ఫాంగ్ జాంగ్.. ఈ అధ్యయనం వివరాలు రాసిన సీనియర్ రచయిత, ఇలా అన్నారు.. “కాఫీలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. కానీ చక్కెర లేదా కొవ్వు కలిపితే, చనిపోయే రిస్క్ తగ్గే ప్రయోజనం కూడా తగ్గిపోతుంది.”
ఈ అధ్యయనం కోసం.. 1999 నుంచి 2018 వరకు అమెరికాలో నిర్వహించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) యొక్క తొమ్మిది వరుస సైకిల్స్ డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఈ డేటాను జాతీయ మరణ డేటాతో అనుసంధానించారు. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 46,000 మంది గురించి.. 24 గంటల ఆహార ప్రశ్నాపత్రాలను కూడా పరిశీలిన చేశారు.
కాఫీ తాగే అలవాట్లను పలు రకాలుగా విభజించారు. కెఫీన్ ఉన్న కాఫీ, కెఫీన్ లేని కాఫీ, చక్కెర జోడించిన కాఫీ, కొవ్వు కలిపిన కాఫీ. అలాగే ఇదే కాలంలో మరణించిన వారి డేటాను కూడా వారి మరణాలను బట్టి కారణాలను పరిశీలించారు. అవి.. ఏ కారణంతోనైనా మరణం, క్యాన్సర్ వల్ల మరణం, గుండె జబ్బుల వల్ల మరణం.
టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన బింగ్జీ జౌ, ఈ అధ్యయనం మొదటి రచయిత. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. “కాఫీలో చక్కెర లేదా కొవ్వు కలపడం వల్ల మరణ రిస్క్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో చాలా తక్కువ అధ్యయనాలు పరిశీలించాయి. ఈ విషయంలో మా అధ్యయనం మొదటిది. కాఫీ తాగని వారితో పోలిస్తే.. బ్లాక్ కాఫీ లేదా తక్కువ చక్కెర, తక్కువ (కొవ్వు) పాలు కలిపిన కాఫీ తాగడం వల్ల ఏ కారణంతోనైనా మరణ రిస్క్ 14 శాతం తగ్గుతుంది.” అని అన్నారు.
రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగితే.. ఏ కారణంతోనైనా మరణ రిస్క్ 17 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెప్పారు. కానీ రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగితే అదనపు ప్రయోజనాలు ఉండవని వారు తెలిపారు.
Also Read: విటమిన్ డి కోసం ఎండలో ఎంతసేపు ఉండాలి.. నిపుణుల సమాధానమిదే
అంతేకాక, రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే, గుండె జబ్బుల వల్ల మరణ రిస్క్ పెరిగే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరించారు. మొత్తంగా చూస్తే.. ఈ అధ్యయనం బ్లాక్ కాఫీ లేదా తక్కువ చక్కెర, తక్కువ పాలు కలిపిన కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది. తగిన మోతాదులో రోజూ కాఫీ తాగడం వల్ల ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా, బ్లాక్ కాఫీని ఎంచుకోవడం మంచి ఎంపిక కావచ్చు.