పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలము. పొట్టలో చిన్న అసౌకర్యం, గడబిడ, నొప్పి వంటివి వస్తే చాలు ఏ పనీ చేయలేక మనిషి కూలబడిపోతాడు. అయితే పొట్ట ఆరోగ్యాన్ని నిర్ణయించేది మనం తినే ఆహారమే. కొన్ని రకాల ఆహారాలను మీరూ ప్రతిరోజు తింటే మీ పొట్ట ఆరోగ్యం చెడిపోతుంది.
మనం తినే వివిధ రకాల ఆహారంలో శరీరంలో చేరాక ప్రతిచర్యలను చూపిస్తాయి. మనం తినే ఆహారాలు పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. పోషకాలను అందించాలి. అయితే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తినడం వల్ల పొట్టలో ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గట్ బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే జీర్ణాశయంతర సమస్యలు కూడా అధికంగా ఉంటున్నాయి. పొట్ట ఆరోగ్యం పై వివిధ రకాల ఆహారాల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్నిబట్టి ఆహా పదార్థాలను తినాల్సిన అవసరం ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాల్లో పొట్ట ఆరోగ్యంతోనే మానసిక సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ముడిపడి ఉన్నట్టు తేలింది. అలాగే జీర్ణాశయంతర రుగ్మతలు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటివి కూడా మన పొట్ట, పేగు ఆరోగ్యాలపై ఆధారపడి ఉన్నట్టు తెలిసింది. కాబట్టి మనం తినే ఆహారాల్లో ఏ ఆహారాలను తగ్గించాలో తెలుసుకోండి.
పంచదార
తీపిగా ఉండే పదార్థాలలో ఎక్కువగా పంచదారని వినియోగిస్తారు. ప్రతిరోజు మీరు పంచదారతో చేసిన ఆహారాలను తింటే అవి శరీరంలో చేరాక విషంగా మారిపోతాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం అధిక చక్కెర జోడించిన ఆహారాలు మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియాల సంఖ్యను దెబ్బతీస్తాయి. ఈ చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. అలాగే క్యాన్సర్ తో సహా అనేక వ్యాధులకు కారణం అవుతుంది.
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు క్రంచీగా, క్రిస్పీగా తినాలనిపించేలా ఉంటాయి. కానీ వాటిలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికమైపోతాయి. వాటిని తినడం వల్ల ఆహారాలు సరిగా జీర్ణం కావు. ఇవి మీ పొట్టని చికాకు పెట్టడంతో పాటు విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపునొప్పిని కలిగిస్తాయి. ఇవి ప్రాణాంతక కాలేయ వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి ప్రతిరోజు వేయించిన ఆహారాలు తినడం మానేయండి. నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే అలాంటివి తినండి.
జంతు ప్రోటీన్
మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లలో జంతు ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది కూడా. అయితే ఏదైనా కూడా ఎంత అవసరమో అంతే తినాలి. అవసరానికి మించి తింటే అది సమస్యలకు కారణం అవుతుంది. అలాగే మీరు మాంసాన్ని, పాల ఉత్పత్తులను, కోడిగుడ్లను అధికంగా తింటే అందులోని జంతు ప్రొటీన్ హానికరమైన మార్పులకు కారణం అవుతుంది. కాబట్టి అధిక జంతు ప్రోటీన్ కూడా శరీరంలో చేరకుండా జాగ్రత్త పడండి. రోజుకు ఒక కోడి గుడ్డుతోనే సరిపెట్టుకోండి. అలాగే ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో చికెన్ తినడం, పాలు తాగడం వంటివి తగ్గించండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినాలి. బ్లాక్ బీన్స్, కొమ్ము శనగలు, తృణధాన్యాలు, బ్రోకోలి, ఆకుకూరలు, బాదం, పిస్తా, వెల్లుల్లి వంటివి ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి.
Also Read: రోజుకు ఇన్ని అడుగులు వేస్తే చాలు, ఆ ప్రాణాంతక వ్యాధిని అడ్డుకోవచ్చు