Father’s Day 2025: ప్రతి సంబంధానికి ప్రత్యేకమైన భావోద్వేగాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమను వర్ణించలేము. తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ.. సమాజంలో బిడ్డ సురక్షితంగా ఉండేలా చూసుకునేది తండ్రే. బిడ్డకు తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. తల్లి తన బిడ్డను బహిరంగంగా ముద్దు చేస్తుంది. లాలిస్తుంది.
అన్ని సందర్భాల్లో తండ్రి తల్లిలాగా పిల్లల పట్ల అదే ప్రేమను చూపించలేడు. కానీ పిల్లల కోరికలు, కలలు, అభిరుచులు, ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి అడుగు వేయడం ద్వారా ప్రేమను చూపిస్తాడు. అది అర్ధం చేసుకోవడం పిల్లల బాధ్యత.
తండ్రి కఠినత్వం అతని ఆందోళన, ప్రేమను దాచిపెడుతుంది. పిల్లలు మాత్రం తండ్రి కుటుంబం కోసం చేసే త్యాగాలను అర్థం చేసుకోవాలి. ఇందుకోసమే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. మీరు మీ తండ్రి చేసిన కృషికి కృతజ్ఞతలు ఈ ప్రత్యేకమైన రోజున తెలియజేయవచ్చు. జూన్ నెలలో తండ్రికి అంకితం చేయబడిన ఈ ప్రత్యేక రోజును ఫాదర్స్ డేగా జరుపుకుంటారు.
2025 లో ఫాదర్స్ డే ఎప్పుడు ?
ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫాదర్స్ డే జూన్ 15, 2025 న జరుపుకోనున్నాము.
ఫాదర్స్ డే చరిత్ర:
ఫాదర్స్ డేను మొట్టమొదట 1910లో అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో జరుపుకున్నారు. అయితే.. 1908లో ఒక కుమార్తె తన తండ్రి జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఫాదర్స్ డే జరుపుకోవడానికి పునాది వేశారు. దీని తరువాత.. 1966లో జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డేను అధికారికంగా గుర్తించారు.
మొదటిసారి ఫాదర్స్ డేను ఎవరు జరుపుకున్నారు ?
ఫాదర్స్ డే అనేది ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి కోసం చేసిన ప్రయత్నం. ఫాదర్స్ డే జరుపుకోవడానికి మొదటి ప్రయత్నం గ్రేస్ గోల్డెన్ క్లేటన్ చేసింది. 1908లో గ్రేస్ వెస్ట్ వర్జీనియాలోని ఫెయిర్‌మాంట్‌లో తన తండ్రి జ్ఞాపకార్థం చర్చి సేవను నిర్వహించింది. అయితే.. ఈ కార్యక్రమానికి అప్పట్లో అంతగా గుర్తింపు లభించలేదు.
జూన్‌లో మాత్రమే ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు ?
1910లో.. వాషింగ్టన్ కుమార్తె కూడా అదే డిమాండ్‌ను లేవనెత్తింది. సోనోరా స్మార్ట్ డాడ్ తన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ కోసం మొదటిసారిగా ఫాదర్స్ డేను జరుపుకుంది. విలియమ్‌కు ఆరుగురు పిల్లలు ఉన్నారు. తన తండ్రి పెంపకాన్ని గౌరవించడానికి, అతని జ్ఞాపకార్థం.. సోనోరా అధికారికంగా జూన్ 19, 1910న వాషింగ్టన్‌లోని స్పోకేన్‌లో మొదటిసారి ఫాదర్స్ డేను జరుపుకుంది. సోనోరా తండ్రి పుట్టినరోజు కావడంతో జూన్ 19న ఫాదర్స్ డే జరుపుకున్నారు.
ఫాదర్స్ డేకు అధికారిక గుర్తింపు:
1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డేగా జాతీయ గుర్తింపు ఇచ్చారు. తరువాత 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఈ రోజును శాశ్వత జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.
Also Read: వీళ్లు.. కివీ ఫ్రూట్ అస్సలు తినకూడదు తెలుసా ?
ఫాదర్స్ డే యొక్క ప్రాముఖ్యత:
తండ్రి సహకారం, కృషి, అంకితభావాన్ని గౌరవించడానికి ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఫాదర్స్ డే మన తండ్రి పట్ల మన కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అంతే కాకుండా మన జీవితంలో ఆయన చేసిన త్యాగాలను అభినందించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజున.. పిల్లలు తమ తండ్రికి ప్రత్యేకంగా ఏదైనా ఇవ్వవచ్చు. అంతే కాకుండా తమ తండ్రికి బహుమతులు ఇవ్వడం ద్వారా లేదా ఆయనను సంతోషపెట్టడానికి వివిధ ప్రయత్నాలు చేయడం ద్వారా వారి పట్ల తమ ప్రేమను వ్యక్తపరచవచ్చు.