అప్పట్లో సాయంత్రం 5 దాటిందంటే చాలు… ఇంట్లో ఉండే పిల్లలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేవాళ్లు… స్కూల్ నుంచి రాగానే… బ్యాగు ఎక్కడ పడితే అక్కడ పడేసి… చెప్పులు కూడా సరిగ్గా విప్పకుండా… “అమ్మా… ఆడుకోవడానికి వెళ్తున్నా” అంటూ వీధిలోకి పరుగులు పెట్టేవాళ్లం… చేతిలో ఓ గోలి ఉంటే చాలు… అదే మనకు ప్రపంచం. బాటిళ్లు నిండా గోలీలు ఉంటే… ఏదో పెద్ద సంపద మన దగ్గర ఉన్నట్టు మురిసిపోయేవాళ్లం.
ఇక బొంగరం చేతిలో పడిందంటే… చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయేవాళ్లం. దారానికి బొంగరం చుట్టి… ఒక్కసారి నేలపైకి వదిలితే… అది ఎంతసేపు తిరుగుతుందో చూస్తూ మురిసిపోయేవాళ్లం. దాగుడుమూతలు మొదలైతే ఇంకో సందడి… ఎక్కడ దాక్కోవాలి..? ఎవరికి కనిపించకూడదు..? అంటూ ఇళ్ల చుట్టూ, గోడల వెనుక, చెట్ల చాటున దాక్కునేవాళ్లం. ఒకరి ఇంటి ముందు మొదలైన ఆట… చూస్తుండగానే మొత్తం వీధి ఆటగా మారిపోయేది.
ఆ రోజుల్లో ఆట అంటే గెలవడం కాదు… కలిసి ఉండటం. ఓడిపోయినా నవ్వుకునేవాళ్లం… గెలిచినవాడితో రేపు మళ్లీ ఆడేవాళ్లం. చిన్న చిన్న గొడవలు…
“నీతో ఆడను పో…”అంటూ అలకలు… మళ్లీ కాసేపటికే అదే స్నేహం… ఆ వయసులో కోపం కూడా ఎక్కువసేపు ఉండేది కాదు. ఆటలో పడి తినడం కూడా మర్చిపోయేవాళ్లం. అమ్మ వచ్చి… “రా… అన్నం తిను” అని పిలిస్తే… “వస్తున్నా అమ్మా…” అని చెప్పి ఇంకాసేపు ఆడుకునేవాళ్లం. అమ్మ రెండోసారి పిలిస్తే భయం… మూడోసారి పిలిస్తే పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లడం… ఆ మందలింపుల్లో కూడా ఓ ప్రేమ ఉండేది.
ఇప్పుడు కాలం మారిపోయింది… గోలీల స్థానంలో మొబైల్స్ వచ్చాయి… బొంగరాల స్థానంలో ఆన్‌లైన్ గేమ్స్ వచ్చాయి… వీధుల్లో స్నేహితులతో కలిసి ఆడే రోజులు తగ్గిపోయాయి… స్క్రీన్ ముందు కూర్చుని ఒంటరిగా గేమ్స్ ఆడే రోజులు పెరిగాయి. అందుకే 80’s ట్రెండ్ అంటే కేవలం పాత ఫొటోలు కాదు… అది మనలో దాగిపోయిన చిన్న పిల్లాడిని మళ్లీ బయటకు తీసుకొచ్చే ఓ అందమైన జ్ఞాపకం.
Also Read: 80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..
Also Read: 80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!