అది 80’s కాలం. ప్రేమను చెప్పాలంటే ముందుగా మనసులో ఎన్నో మాటలు పుడతాయి. కానీ వాటిని బయటకు చెప్పడానికి మాత్రం ఎంతో ధైర్యం కావాల్సి వచ్చేది. అందుకే అప్పటి ప్రేమకు తోడుగా నిలిచింది ఓ చిన్న కాగితం. అదే ప్రేమ లేఖ. ఎన్నిసార్లు రాసేవారో… ఎన్నిసార్లు చించేసేవారో లెక్కే ఉండేది కాదు. మనసులో ఉన్న ప్రతి భావాన్ని జాగ్రత్తగా అక్షరాల్లో పెట్టాలనే ఆ తపన ఉండేది. “నిన్ను ఇష్టపడుతున్నాను” అనే ఒక్క మాట చెప్పడానికి ఎన్ని రోజులు పట్టేదో. ఆ లేఖ చేతిలో పెట్టే క్షణంలో గుండె వేగంగా కొట్టుకునేది. అవతలి వ్యక్తి చదివారా..? ఏం అనుకున్నారో..? అనే ఆలోచనలతో రోజులే గడిచిపోయేవి. అప్పటి ప్రేమలో ఆ ఎదురుచూపే ఓ అందమైన జ్ఞాపకంగా మిగిలింది.
ప్రేమ లేఖ అప్పట్లో ఓ కాగితం కాదు..
అది ఓ మనసు…
పుస్తకాల మధ్య దాచుకున్న లేఖలు… ఎవరూ చూడకుండా జాగ్రత్తగా దాచుకున్న జ్ఞాపకాలు… ఆ అక్షరాల్లో అప్పటి నవ్వులు… ఇలా ఆ మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు ఉండేవి… ఒక లేఖ కోసం రోజులు ఎదురుచూసిన ప్రేమ వర్ణణాతీతం… ఒకసారి వచ్చిన లేఖను పదేపదే చదివిన ఆనందం చెప్పలేనిది… ఇవన్నీ 80’s ప్రేమకు ప్రత్యేకమైన గుర్తులు. అప్పటి ప్రేమలో వేగం తక్కువ… కానీ అనుభూతి ఎక్కువ ఉండేది.
కానీ ఇప్పుడు కాలం మారిపోయింది… ప్రేమను చెప్పే విధానం కూడా మారింది. లేఖల స్థానంలో మెసేజ్‌లు వచ్చాయి. ఎదురుచూపుల స్థానంలో ఇన్‌స్టంట్ రిప్లైలు వచ్చాయి. ఒకప్పుడు పరిచయం పెరగడానికి నెలలు పట్టేది… ఇప్పుడు డేటింగ్ యాప్స్ ద్వారా క్షణాల్లో పరిచయాలు మొదలవుతున్నాయి. టెక్నాలజీ ప్రేమను దగ్గర చేసింది… కానీ ఒక లేఖ కోసం ఎదురుచూసిన ఆ ఆనందం… చేతికి అందిన లేఖను గుండెల్లో పెట్టుకున్న ఆ అనుభూతిని మాత్రం దూరం చేసింది. అది మాత్రం 80’s ప్రేమకే ప్రత్యేకం. అందుకే ఇప్పుడు వైరల్ అవుతున్న 80’s ట్రెండ్… కేవలం పాత ఫొటోలను గుర్తు చేయడం కాదు… ఓ తరం ప్రేమను… ఓ తరం ఎదురుచూపులను… మనసుకు దగ్గరైన ఆ మధురమైన జ్ఞాపకాలను మళ్లీ మన ముందుకు తీసుకొస్తోంది.
Also Read: తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!
Also Read: 1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!