Horror Comedy Mystery Series: ఒక మారుమూల పట్టణంలో పురాతన అవశేషాలు బయట పడితే అది కేవలం చరిత్రకు సంబంధించిన విషయమే అనుకుంటాం. కానీ ఆ అవశేషాల వెనుక ఓ భయంకరమైన దుష్టశక్తి దాగి ఉంటే ? వాటిని కనిపెట్టిన ఆర్కియాలజిస్ట్ ఒక్కసారిగా అదృశ్యమైతే ? తండ్రి కోసం వచ్చిన కూతురికి ధ్వంసమైన ఇల్లు, 40 శపించబడిన విగ్రహాలు, అంతుచిక్కని ఆధారాలు ఎదురైతే ? అసలు ఆ విగ్రహాలకు, ఊరిలో జరుగుతున్న వింత సంఘటనలకు సంబంధం ఏంటి ? ఈ మిస్టరీ వెనుక ఉన్న శక్తి బయటకొస్తే ఏం జరుగుతుంది ? ఇలాంటి హారర్, కామెడీ, మిస్టరీ అంశాలను కలిపి తెరకెక్కించిన సిరీస్ ‘అలీ బాబా ఔర్ 40 భూత్’ (Ali Baba aur 40 Bhoot). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
కథ ఝులియా అనే మారుమూల పట్టణంలో మొదలవుతుంది. పురాతన ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్న ఆర్కియాలజిస్ట్ తపిష్ నిగమ్ కి కొన్ని వింతైన అవశేషాలు దొరుకుతాయి. అవి సాధారణ పురాతన వస్తువులు కాదని, ఏదో ప్రాచీన దుష్టశక్తితో సంబంధం ఉన్నవని అతనికి అర్థమవుతుంది. ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉండగానే తపిష్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. తండ్రి ఆచూకీ కోసం అతని కూతురు అలీషా నిగమ్ తన ఊరికి తిరిగి వస్తుంది. అయితే అక్కడ ఆమెకు స్వాగతం పలికేది తండ్రి ఇల్లు కాదు… పూర్తిగా ధ్వంసమైన ఇల్లు. తపిష్ కు ఏమైంది ? అతను చివరిగా ఏం పరిశోధించాడు అనే విషయాలను తెలుసుకునేందుకు అలీషా అక్కడి ఆధారాలను వెతకడం మొదలు పెడుతుంది.
అలా ఆమెకు 40 శపించబడిన విగ్రహాల గురించి తెలుస్తుంది. ఈ విగ్రహాలు ఝులియాలో జరుగుతున్న వింత సంఘటనలకు కేంద్ర బిందువుగా మారతాయి. వాటి వెనుక పురాతన శక్తులు, తెలియని ప్రపంచానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని అలీషా గుర్తిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆమెకు నమ్మకాలు ఎక్కువగా ఉండే పోలీస్ ఆఫీసర్ బాబారావు ఉపాధ్యాయ, ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ తోడవుతారు. ముగ్గురూ కలిసి తపిష్ ఆచూకీ కోసం వెతుకుతూ ఒక్కో రహస్యాన్ని బయటకు తీస్తారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. చిన్నప్పుడు తండ్రి నేర్పించిన సీక్రెట్ కోడ్ గేమ్ ను ఉపయోగించిన అలీషా ఓ వాయిస్ మెసేజ్ ను డీకోడ్ చేస్తుంది.
దాని ద్వారా ఇంట్లోనే దాగి ఉన్న రహస్య భూగర్భ గదిని గుర్తిస్తుంది. అక్కడ లభించే ఆధారాలు తపిష్ అదృశ్యం వెనుక సాధారణ కారణం లేదని స్పష్టం చేస్తాయి. మరోవైపు మరీద్ అనే దుష్టశక్తికి తపిష్‌ను, పురాతన శక్తులను అప్పగించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర చేస్తుంటారు. ఆ 40 విగ్రహాల అసలు శక్తి ఏంటి ? తపిష్ ను ఎవరు ఎందుకు టార్గెట్ చేశారు ? మరీద్ శక్తులు బయటకు రాకుండా అలీషా, బాబారావు, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఎలా అడ్డుకున్నారు ? ఊరిని మాత్రమే కాదు ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే ఈ శక్తుల నుంచి అందరినీ ఎలా కాపాడారు ? అనేదే సిరీస్ లోని అసలు ఉత్కంఠ. హారర్ సన్నివేశాలకు కామెడీని జోడిస్తూ మిస్టరీని ముందుకు తీసుకెళ్లడం ఈ సిరీస్ కు ప్రత్యేక ఆకర్షణ.
‘అలీ బాబా ఔర్ 40 భూత్’ (Ali Baba aur 40 Bhoot) ప్రస్తుతం ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లోనూ అందుబాటులో ఉంది. హారర్, మిస్టరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఉన్న కంటెంట్ ను ఇష్టపడేవారికి ఈ సిరీస్ ఒకసారి ట్రై చేయొచ్చు.
Read Also: జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్