Fresh Covid-19 Cases: కేరళలో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. 2025 మే నెల ప్రారంభం నుండి ఇప్పటివరకు 182 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
ఈ కేసులు ప్రధానంగా కొట్టాయం (57 కేసులు), ఎర్నాకులం (34 కేసులు), తిరువనంతపురం (30 కేసులు) జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ పెరుగుదల దక్షిణాసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్‌లలో కోవిడ్ కేసుల సంఖ్యకు సమానంగా ఉంది. ఇక్కడ ఒమిక్రాన్ జెఎన్.1, ఎల్ఎఫ్.7, ఎన్బీ 1.8 వంటి సబ్-వేరియంట్లు కూడా ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ .. వాటి తీవ్రత మాత్రం తక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ.. జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు.
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం.. ప్రజలు అన్ని బహిరంగ ప్రదేశాలు, సమావేశాలు, ప్రజా రవాణాలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అదనంగా, ఆసుపత్రుల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు, ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలని సూచించారు. జలుబు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇతర తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని తెలిపింది.
కేవలం మాస్క్ ధరించడానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆసుపత్రుల్లో ఆర్‌టి-పిసిఆర్ టెస్టింగ్ కిట్లు, రక్షణ పరికరాల స్టాక్‌ను నిర్ధారించమని కూడా ఆదేశించింది. లక్షణాలు కనిపించే వ్యక్తుల కోసం టెస్టింగ్‌ను పెంచాలని, రాష్ట్రవ్యాప్తంగా నిఘాను బలోపేతం చేయాలని సూచించింది. దుకాణాలు, థియేటర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు సానిటైజర్లు , చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలు సామాజిక దూరం పాటించడంతో పాటు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సహాయపడతాయని భావిస్తున్నారు.
గతంలో కూడా కేరళలో ఇలాంటి చర్యలే అమలు చేశారు. 2022 ఏప్రిల్‌లో కూడా..కోవిడ్ కేసులు పెరగడంతో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. అయితే, ఆ సమయంలో పెనాల్టీలు అమలు చేయడంలో పోలీసులు కొంత అలసత్వం వహించారు. కానీ ఈ సారి అలా జరగకుండా మాస్క్ ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద జరిమానాలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో.. మాస్క్ ధరించని వారిపై రూ. 500 జరిమానా విధించారు.
Also Read: అసలు తలనొప్పి ఎన్ని రకాలో తెలుసా ?
ఇదిలా ఉంటే కేరళలో కోవిడ్-19 మొదటి కేసు 2020 జనవరి 30న త్రిస్సూర్ జిల్లాలో నమోదైంది. అప్పటి నుండి.. రాష్ట్రం కఠినమైన నిఘా, క్వారంటైన్, టెస్టింగ్ వ్యూహాలతో వైరస్‌ను నియంత్రించడంలో విజయవంతమైంది. ప్రస్తుతం.. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ల వ్యాప్తి కారణంగా రాష్ట్రం మళ్లీ అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ అధికారులు, ఈ వేరియంట్లు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే అవకాశం తక్కువ అయినప్పటికీ, రీ-ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాల ప్రభావాల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.