Friendship Day history: ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రాగానే.. మన చేతులకు రంగు రంగుల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకోవడం, బెస్ట్ ఫ్రెండ్స్‌కు విషెస్ చెప్పుకోవడం మనందరికీ అలవాటే. కానీ.. అసలు ఫ్రెండ్ షిప్ డే ఎందుకు జరుపుకుంటారు? ఈ ట్రెండ్ ఎలా ప్రారంభం అయింది? దీని వెనక ఏ దేశం ప్రమేయం ఉంది? ఫ్రెండ్షిప్ డే చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ ప్రపంచ వ్యాపంగా జరుపుకునే ఈ వేడుకల ప్రత్యేకతలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనుషుల మధ్య బంధాలు ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ ఎలాంటి స్వార్థం లేకుండా, కులమతాలకు అతీతంగా నిలిచే ఏకైక పవిత్రమైన బంధం స్నేహం. ఇదిలా ఉంటే నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ చాట్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలో స్నేహం రూపుమారినప్పటికీ, దాని సారం మాత్రం ఎప్పటికీ మారలేదు. అయితే.. ఈ స్నేహానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలనే ఆలోచన ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా?
ఇదిలా మొదలైంది?
ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. దీని వెనక ప్రధానంగా రెండు చారిత్రక కథనాలు వినిపిస్తాయి.
మొట్టమొదటి అంతర్జాతీయ ప్రతిపాదన (1958): 1958 జులై 30న పరాగ్వే దేశంలో జోయ్ ఆర్టెమియో బ్రాకో అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఒక డిన్నర్ పార్టీలో గడుపుతున్న సమయంలో.. ఈ ఆలోచనను తెరపైకి తెచ్చారు. ప్రపంచమంతా శాంతిని, స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి “వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రుసేడ్”ను ప్రతిపాదించారు. ఆ రోజే మొట్ట మొదటిసారిగా ప్రపంచ అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరపాలని వారు కోరారు.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు: దశాబ్దాల పాటు ఈ వేడుక వివిధ దేశాల్లో వివిధ తేదీల్లో జరుగుతూ వచ్చింది. చివరకు 2011లో ఐక్యరాజ్యసమితి (UN)అధికారికంగా జులై 30 ని ‘అంతర్జాతీయ స్నేహ దినోత్సవం’గా ప్రకటించింది. ప్రజల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఆగస్టు మొదటి ఆదివారమే ఎందుకు?
అంతర్జాతీయంగా జులై 30న జరుపుకున్నప్పటికీ, మనదేశం తో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1930ల ప్రారంభంలో హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీ వ్యవస్థాపకుడు జోయిస్ హాల్ ఈ దినోత్సవాన్ని మార్కెటింగ్,వాణిజ్యపరంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. కాలక్రమేణా ఇది కేవలం గ్రీటింగ్ కార్డ్స్‌కే పరిమితం కాకుండా..యువత గుండెల్లో ఒక ప్రత్యేకమైన పండగలా మారిపోయింది.
Also Read: జీవితంలో నిజమైన స్నేహితుడు ఎందుకు ముఖ్యం? ఫ్రెండ్షిప్ డే స్పెషల్
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్:
ఒకప్పుడు స్నేహితులు ఒక చోట చేరి గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం, రంగుల బ్యాండ్‌లు కట్టుకోవడం ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కటింగ్స్ చేయడం, సోషల్ మీడియాలో స్పెషల్ రీల్స్ పోస్ట్ చేయడం, ఒకరికొకరు ట్రెండ్‌కు తగ్గట్టుగా చిన్న బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమైంది. టెక్నాలజీ ఎంత మారినా.. స్నేహితుల మధ్య ఉండే ఆప్యాయత , అనుబంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది.
మనం ఎన్నుకునే బెస్ట్ ఫ్రెండ్స్ మన జీవితాన్ని అందంగా మారుస్తారు. కష్టసుఖాల్లో తోడుండే నిజమైన మిత్రుడు దొరకడం ఒక అదృష్టం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ బిజీ లైఫ్ నుంచి కొంచెం సమయం కేటాయించి, మీ ప్రయాణంలో తోడుగా ఉన్న ఆ బెస్ట్ ఫ్రెండ్‌కు ఒక చిన్న థాంక్స్ చెప్పి మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా మార్చుకోండి.