రాత్రిపూట ఎక్కువ అన్నం వండడం వల్ల ఉదయానికి అన్నం మిగిలిపోతుంది. అలాగే ఉదయం పూట అన్నం అధికంగా వండినా రాత్రిపూటకు మిగిలిపోవడం వంటివి జరుగుతూనే ఉంటుంది. ఇది ప్రతి ఇంట్లో జరిగే ప్రక్రియ. ఇలా ఉండిపోయిన అన్నాన్ని లేదా మిగిలిపోయిన అన్నాన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. నిజానికి మిగిలిపోయిన అన్నంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. వాటిని పడేసే బదులు తిరిగి వినియోగించుకోవడం మంచిది. ఇందుకోసం మీరు మిగిలిపోయిన అన్నంతో టేస్టీగా, క్రంచీగా గారెలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము మిగిలిపోయిన అన్నంతో క్రంచీగా గారెలు ఎలా చేయాలో ఇచ్చాము. ఇది ఫాలో అయితే మీకు టేస్టీ బ్రేక్ ఫాస్ట్ లేదా డిన్నర్ రెడీ అయిపోతుంది.
గారెలకు కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం – రెండు కప్పులు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
మైదాపిండి – మూడు స్పూన్లు
పెరుగు – ఒక కప్పు
కొబ్బరి తురుము – ఒక కప్పు
టమోటో – ఒకటి
క్యాప్సికం – ఒకటి
క్యాబేజీ తరుగు – పావుకప్పు
అల్లం పచ్చిమిర్చి పేస్ట్ – రెండు స్పూన్లు
కారం పొడి – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
జీలకర్ర – అర స్పూను
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మిగిలిపోయిన అన్నంతో గారెలు రెసిపీ
⦿ అన్నం మిగిలిపోతే ఒక గిన్నెలో వేయండి.
⦿ చేతితోనే దాన్ని మెత్తగా మెదపండి.
⦿ ఆ అన్నంలోనే పెరుగును కూడా వేసి బాగా మెత్తగా అయ్యేలా చేత్తోనే కలపండి.
⦿ ఇప్పుడు అందులో మైదా పిండిని కూడా వేసి బాగా కలపండి.
⦿ కొత్తిమీర తరుగు, కరివేపాకుల తరుగు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపండి.
⦿ ఇప్పుడు కొబ్బరి తురుమును, కారంపొడిని వేసి బాగా కలపండి.
⦿ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేయండి.
⦿ టమోటోలు, క్యాప్సికం, సన్నగా తరిగి అందులో వేసి కలుపుకోవాలి.
⦿ అలాగే క్యాబేజీ తురుమును కూడా వేసి బాగా కలపాలి.
⦿ అవసరం అయితే కొంచెం నీటిని కలుపుకోవచ్చు.
⦿ గారెలు వేయడానికి ఎంత మందంగా పిండి కావాలో అంత మందానికి వచ్చేవరకు నీళ్లు వేయండి.
⦿ మరీ పల్చగా అయిపోతే గారెలు రావు.
⦿ ఇక స్టవ్ మీద కలాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి నూనెను వేయండి.
⦿ బాగా వేడెక్కాక మంటను మీడియం మీద ఉంచండి.
⦿ ఇప్పుడు ఈ మిశ్రమంలోంచి చిన్న చిన్న ముద్దలను తీసి చేత్తోనే గారెల్లా వత్తుకొని మధ్యలో చిల్లు పెట్టుకోండి.
⦿ వేడివేడి నూనెలో వీటిని వేసి రెండు వైపులా బాగా వేగించండి.
⦿ ఎరుపు రంగు వచ్చేవరకు బాగా వేగించాక తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోండి.
⦿ ఇలా అన్నింటినీ చేసి టిష్యూ పేపర్ తో ఒకసారి ఒత్తండి.
⦿ గారెల్లో ఉన్న అధిక నూనె టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.
⦿ ఇప్పుడు టేస్టీగా గారెలు రెడీ అయిపోయినట్టే వీటిని కొబ్బరి చట్నీతో గాని పల్లీల చట్నీతో కానీ చికెన్ ఇగురుతో గాని తింటే రుచి అదిరిపోతుంది.
ఈ గారెల్లో మనము ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పదార్థాలను వేసాము. ఇక ఆరోగ్యానికి హాని చేసే మైదాను చాలా తక్కువగా వేసాము. పెరుగు, కొబ్బరి తురుము, అల్లము, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికం, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ కూడా మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కాబట్టి ఈ గారెలను అప్పుడప్పుడు చేసుకొని తినడానికి ప్రయత్నించండి. ఇవి డీప్ ఫ్రై చేసిన వంటకాలు కాబట్టి తరచూ తినే కన్నా వారానికి ఒకసారి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదే. ప్రతిరోజు ఇలాంటి ఫ్రై చేసిన ఆహారాలు తినడం మాత్రం మంచి పద్ధతి కాదు.
Also Read: ఖాళీ పొట్టతో నెయ్యి తింటే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి