bitter gourd: చేదుగా ఉంటుందని చాలా మంది కాకరకాయను తినేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ, దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాకరకాయ తినకుంటే ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
షుగర్ కంట్రోల్
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కాకరకాయ సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలీపెప్టైడ్-పి వంటి సమ్మేళనాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం లేదా కూర తీసుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించవచ్చు. అందుకే డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువగా కాకరకాయను తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి
కాకరకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుందట. ఇందులో ఉండే విటమిన్-సి, విటమిన్-ఎ, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీని వల్ల జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
జీర్ణక్రియ
కాకరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందట. కాకరకాయ రసం లేదా కూర తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరిగి, ఆహారం సులభంగా జీర్ణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.అంతేకాకుండా ఇది ఆకలిని పెంచడంలో కూడా కాకరకాయ సహాయపడుతుందట.
చర్మ సంరక్షణ
కాకరకాయ చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు తోడ్పడతాయట. కాకరకాయ రసం తాగడం లేదా దాని పేస్ట్‌ను చర్మంపై రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుందట. ఇది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది.
వెయిట్ లాస్
బరువు తగ్గాలనుకునేవారికి కాకరకాయ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినడం తగ్గుతుంది. కాకరకాయ రసం లేదా సలాడ్‌ను ఆహారంలో చేర్చడం వల్ల బరువు తగ్గిడం కూడా ఈజీ అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ నివారణ
క్యాన్సర్ నివారణలో కూడా కాకరకాయ హెల్ప్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ కణాలు పెరగకుండా చేయడంలో సహకరిస్తాయట. అయితే, ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దీన్ని కూర, రసం, సలాడ్ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. అయితే, దీన్ని అతిగా తీసుకోవడం వల్ల కొందరికి కడుపు నొప్పి లేదా విరేచనాలు రావచ్చు, కాబట్టి మితంగా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు లేదా మెడిసిన్ వాడుతున్నవారు డాక్టర్ల సలహా తీసుకోని మాత్రమే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.