Cinnamon: దాల్చిన చెక్క అనేది ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం. ఇది కేవలం వంటలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని ఒక ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కలో ముఖ్యంగా సిన్నమాల్డిహైడ్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్లే దాల్చిన చెక్కకు ప్రత్యేకమైన రుచి, వాసన లభిస్తాయి. అలాగే.. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
మధుమేహ నియంత్రణ (Blood Sugar Control): దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. అంతే కాకుండా దీనివల్ల కణాలు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా గ్రహించగలుగుతాయి. టైప్-2 మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు తగ్గడం (Weight Loss): దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అంతేకాకుండా.. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చక్కెర పదార్థాలు తినాలనే కోరికను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు (Heart Health): దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే.. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఈ లక్షణాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
యాంటీఆక్సిడెంట్ గుణాలు: దాల్చిన చెక్కలో ఉండే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, గుండె జబ్బులు , అల్జీమర్స్ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.
మెదడు పనితీరును మెరుగుదల: దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది జ్ఞాపకశక్తి , ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మెదడు బాగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దంతాల ఆరోగ్యం: దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను నియంత్రించి.. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఇది దంతాల నొప్పి, చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే దాల్చిన చెక్క తరచుగా తినడం అలవాటు చేసుకోవాలి.
Also Read: కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే !
దాల్చిన చెక్క వాడకంలో జాగ్రత్తలు:
దాల్చిన చెక్క చాలా ఆరోగ్యకరమైనది అయినప్పటికీ.. కొన్ని రకాల దాల్చిన చెక్కలో “కౌమరిన్” అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి హాని కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. మోతాదుకు మించి తీసుకోకుండా ఉండాలి. మధుమేహం లేదా అధిక రక్తపోటు కోసం మందులు వాడేవారు దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకోవడానికి ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
రోజూ అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో లేదా టీలో కలుపుకొని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటంలో కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.