Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం అనేది ఆధునిక జీవనశైలిలో ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు, స్ట్రోక్‌కు దారితీసే ప్రధాన కారణాలలో ఒకటి. అయితే.. మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల “సూపర్‌ఫుడ్స్” చేర్చడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి..మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచవచ్చు. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ఆహార పదార్థాలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఓట్స్, తృణధాన్యాలు:
ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో “సాల్యుబుల్ ఫైబర్” పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థలో జిగురు లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. అంతే కాకుండా ఇది ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను రక్తంలోకి గ్రహించకుండా అడ్డుకుంటుంది. రోజుకు ఒక కప్పు వోట్మీల్ లేదా బార్లీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.
2. నట్స్, విత్తనాలు:
బాదం, వాల్‌నట్స్, వేరుశనగ, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిలో ఆరోగ్యకరమైన మోనో అన్శాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ , ప్లాంట్ స్టెరాల్స్ ఉంటాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వాల్‌నట్స్ , అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
3. అవకాడో :
అవకాడోలో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. అవకాడోలో ఉండే బీటా-సిటోస్టెరాల్ అనే ప్లాంట్ స్టెరాల్, కొలెస్ట్రాల్‌ను గ్రహించడాన్ని నిరోధిస్తుంది. అవకాడో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.
4. బీన్స్, చిక్కుళ్ళు:
శనగలు, రాజ్మా, పెసలు, కందులు వంటి చిక్కుళ్ళు, బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా.. వీటిలో ఉండే ప్రోటీన్, ఇతర పోషకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే వీటిని తినడం చాలా మంచిది.
5. కొవ్వు చేపలు:
సాల్మన్, మాకెరెల్, సార్డిన్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపలు తినడం మంచిది.
Also Read: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా ?
6. పండ్లు, కూరగాయలు :
యాపిల్స్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు, బెర్రీస్ వంటి పండ్లలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, వంకాయ, ఓక్రా, ఆకుకూరలు వంటి కూరగాయల్లో కూడా అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.
ఈ సూపర్‌ఫుడ్స్‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను సహజంగా నియంత్రించుకోవచ్చు. కేవలం ఆహారం మాత్రమే కాకుండా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం కూడా చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. డాక్టర్‌ని సంప్రదించి, వారి సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం.