Muskmelon: కర్బూజ పండు(Musk Melon) తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వేసవికాలంలో లభించే పండ్లలో కర్బూజ కూడా ఒకటి. ఇది తియ్యని వాసన రుచితో కలిగే పండు. దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. కర్బూజాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు దీనిలో లభిస్తాయి. అంతేకాకుండా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి కర్బూజ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
గుండె సమస్యలకు చెక్ పెడుతుంది:
కర్బూజలో తగినంత నీరు ఉంటుంది. ఈ పండులో యాంటీకోగ్యులెంట్ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే అడెనోసిన్ రక్తం పలుచబడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు తెలిపారు.
కంటిచూపును మెరుగుపరుస్తుంది:
కర్బూజలో విటమిన్ ఎ, కెరోటిన్ ఉండటం వల్ల కంటిశుక్లం నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలను నిరోధించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
అధిక బరువుకు చెక్:
కర్బూజా తియ్యగా ఉంటుంది.. కానీ దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పండులో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఆకలిని తీరుస్తుంది. కర్బూజ జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది, మీరు బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కర్బూజాను ఆల్పాహారంగా తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
గర్భిణులకు మేలు:
కర్బూజాలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అంతే కాకుండా ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది, కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే కర్బూజ జ్యూస్ తాగడం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది, ఒత్తిడి తగ్గి నిద్ర కూడా బాగా పడుతుంది.
Also Read: మిషన్ కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?
తెల్ల రక్తకణాల వృద్ధి:
కర్బూజ పండులో ఎక్కువ శాతంగా ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలోని తెల్ల రక్తకణాలను వృద్ధి చేస్తుంది. అలాగే రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. కావున వేసవిలో క్రమం తప్పకుండా కర్బూజ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.