Orange : ఆరెంజ్ సీజన్ వచ్చేసింది. తీపి, పుల్లగా ఉండే ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సమయంలో ఆరెంజ్ తింటే గొంతు సంబంధిత సమస్యలు పెరుగుతాయని భావిస్తున్నారు. కానీ ఇది చాలా వరకు తప్పు. చాలా మంది నిమ్మ, ఆరెంజ్ లను చలికాలంలో తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ ఎందుకు తినాలి ?
చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ సీజన్‌లో సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు రోజు తినాలి. ప్రతి సీజనల్ పండు , కూరగాయలు అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శీతాకాలంలో వచ్చే పండ్లలో ఆరెంజ్ కూడా ఒకటి. ఇది శీతాకాలపు సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి.
నారింజ తినడం వల్ల కలిగే లాభాలు:
1) రోగనిరోధక శక్తికి ఉత్తమమైనది:
నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపడంతో పాటు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిని రోజు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2) గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:
నారింజ , ద్రాక్షపండ్లు తినడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు తరుచుగా వీటిని తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
3) చలి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది:
సాధారణ జలుబు విషయంలో విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, శీతాకాలంలో నారింజ పండ్లను తినడం వల్ల సాధారణ జలుబు తగ్గుతుంది.
4) బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
నారింజలో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. దీనిని తీసుకోవడం వల్ల అతిగా తినడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది మంచి మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటుంది. అందుకే జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
5) చర్మానికి ఉత్తమమైనది:
ఆరెంజ్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మంచిదని భావిస్తారు. దీన్ని రోజు తినడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
Also Read: వీటిని వాడితే.. జుట్టు పెరగడం పక్కా!
నారింజ తినడానికి ఏ సమయంలో మంచిది:
మీరు మధ్యాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో నారింజ తినవచ్చు. సాయంత్రం లేదా రాత్రిపూట దీనిని తినడం మానుకోవాలి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.