Stop Dinner For Month| రాత్రి భోజనం మానేయడం చిన్న విషయంలా అనిపించినా.. అది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆహారం మన శరీరంలోని ప్రతి వ్యవస్థకు శక్తినిస్తుంది. కానీ, రాత్రి భోజనం తినకపోతే, శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల ప్రకారం.. రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరం లోపల పలు సమస్యలు మొదలవుతాయి. రోజూ ఒకే సమయంలో భోజనం చేయకపోతే, శరీరంలో ఉండే 24 గంటల చక్రం (సిర్కాడియన్ రిథమ్) గందరగోళంలో పడుతుంది. ఈ చక్రం శరీర కార్యకలాపాలను నియంత్రిస్తుంది. రాత్రి సమయంలో సూప్ లేదా సలాడ్ వంటి తేలికైన ఆహారం తీసుకోవడం శరీరాన్ని క్రమబద్ధంగా ఉంచుతుంది. రాత్రి భోజనం మానేస్తే ఏం జరుగుతుందో చూద్దాం.
ఆందోళన చెందడం (స్ట్రెస్, యాంగ్జైటీ)
ఒక్క పూట భోజనం మానేయడం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం.. ఉదయం టిఫిన్ మానేస్తే డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే.. రాత్రి భోజనం మానేస్తే, ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో ఆందోళన పెరుగుతుంది. ఎక్కువ సేపు ఆహారం తీసుకోకపోతే, శరీరం.. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఒత్తిడిని కూడా పెంచుతుంది.
శక్తి తగ్గడం
రోజంతా యాక్టివ్‌గా ఉండి, రాత్రి భోజనం మానేస్తే శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. ఆహారం నుంచి కేలరీలు తక్కువగా అందడం వల్ల అలసట కలుగుతుంది. పోషాకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది మెదడు, శరీరానికి గ్లూకోజ్‌ను తక్కువగా అందిస్తుంది, దీంతో బలహీనత అనిపిస్తుంది.
ఆహార కోరికలు పెరగడం
రాత్రి భోజనం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి, సులభమైన కార్బోహైడ్రేట్లు, చక్కెర ఆహారాలు (స్నాక్స్, స్వీట్స్) తినాలనే కోరికలు పెరుగుతాయి. ఇవి త్వరగా శక్తినిస్తాయి, కానీ ఆ శక్తి తాత్కాలికమే. నిపుణుల ప్రకారం, భోజనం మానేయడం బరువు తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తుంది, ఎందుకంటే ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది.
పోషకాహార లోపం
రాత్రి భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక, దీర్ఘకాలంలో పోషకాహార లోపం వస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు చాలా అవసరం. కార్బోహైడ్రేట్ల కోరికలు పెరిగినప్పుడు, కుకీలు, క్రాకర్స్, స్నాక్ చిప్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తింటాం, ఇవి శరీరానికి కావాల్సిన పోషణ అందించలేదు. అందుకే వీటికి బదులుగా.. తృణధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పాల ఉత్పత్తుల వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి.
తినే అలవాట్లు సరిగా లేకపోతే ఈటింగ్ డిజార్డర్
నిపుణుల ప్రకారం.. భోజనం మానేయడం లేదా సమయానికి తినకపోవడం వల్ల తినే అలవాట్లలో రుగ్మతలకు (ఈటింగ్ డిసార్డర్స్) దారితీస్తుంది. కేలరీలు తగ్గించుకోవడానికి లేదా ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం వల్ల రాత్రి భోజనం మానేయడం ప్రమాదకరం. ఇది మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది.
Also Read: యువతలో ముసలితనం ఛాయలు.. చర్మం యవ్వనంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి
రాత్రి భోజనం మానేయడం శారిరకంగానే కాదు మానసికంగా కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. రోజూ సమయానికి తేలికైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించడంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.