Mobile Phones: మన జీవితంలో సెల్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఉదయం లేస్తూనే ఫోన్ చెక్ చేయడం, రాత్రి పడుకునే ముందు చివరిసారి చూసుకోవడం అలవాటైపోయింది. ఒకప్పుడు మనుషుల మధ్య జరిగే మాటలు, సంభాషణలు ఇప్పుడు ఫోన్ స్క్రీన్‌కే పరిమితమయ్యాయి. ఫోన్ కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా పని, చదువు, వినోదం అన్నింటికీ కేంద్రంగా మారింది. దీనివల్ల మనిషి చుట్టూ ఉన్న వారితో గడిపే సమయం తగ్గిపోతోంది. ఆరోగ్య పరంగా కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మొబైల్ నుంచి వచ్చే లైట్ ఎంత ప్రమాదమో తెలుసా?
ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కళ్లకు ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. పడుకునే ముందు ఫోన్ వాడకం ఇప్పుడు ప్రతి ఒక్కరి అలవాటుగా మారింది. లైట్లు ఆఫ్ చేసి దిండు పక్కన ఫోన్ పెట్టుకుని అందులో వీడియో చూస్తూ నిద్రపోవడం చాలా సాధారణంగా మారింది. కానీ ఈ చిన్న అలవాటు వల్ల కలిగే సమస్యలు మాత్రం చాలా పెద్దవే. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి శరీరంలో నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా గాఢమైన నిద్ర రావడం తగ్గిపోతుంది. రాత్రి మధ్యలో మేల్కొని మళ్లీ నిద్ర పట్టక పోవడం, మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం వంటివి ఎదుర్కొనవలసి వస్తుంది.
ఫోన్ నోటిఫికేషన్ కూడా నిద్రకు ప్రమాదమే
అంతేకాకుండా రాత్రి నిశ్శబ్దంలో వచ్చే చిన్న నోటిఫికేషన్ సౌండ్, వైబ్రేషన్ లేదా స్క్రీన్ మెరుపు కూడా మెదడును కలవరపెడుతుంది. నిద్రలో ఉన్నప్పటికీ మెదడు మెలకువలోనే ఉండమని సంకేతం అందుకుంటుంది. దీని వలన గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు పెరుగుతాయి. ఫోన్ నుంచి వెలువడే తరంగాల ప్రభావం పూర్తిగా నిర్ధారణ కాలేదు కానీ తల దగ్గరగా ఉంచుకోవడం దీర్ఘకాలంలో హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా?
మరొక పెద్ద ప్రమాదం ఏమిటంటే చాలామంది ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి దిండు కింద లేదా దుప్పటి కింద ఉంచుకుంటారు. ఇలా చేస్తే ఓవర్‌హీట్ కావడం, నకిలీ ఛార్జర్లు లేదా వైర్లలో లోపం ఉండడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి ఘటనలు గతంలో పలు చోట్ల నమోదయ్యాయి కూడా.
ఫోన్ పక్కన పెట్టి పడుకోండి
పడుకునే ముందు కనీసం అరగంట ముందు ఫోన్‌కు గుడ్‌బై చెప్పాలి. పడకగదిలో ఫోన్ ఉంచకూడదు. అలారం కోసం వాడుకోవాల్సి వస్తే కూడా చేతికి అందని దూరంలో పెట్టాలి. నిద్రకు ముందు ఫోన్ స్క్రోల్ చేయడం మానేసి, గోరువెచ్చని నీరు తాగడం, పుస్తకం చదవడం లేదా చిన్నగా ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తేనే మనకు నిజమైన విశ్రాంతి లభిస్తుంది. ఉదయాన్నే ప్రశాంతంగా లేవడం, చిరాకు తగ్గిపోవడం, పనిలో ఏకాగ్రత పెరగడం ఇవన్నీ ఒక చిన్న మార్పు వల్లే సాధ్యమవుతాయి. కాబట్టి ఇకపై నిద్రకు వెళ్లే ముందు ఫోన్ పక్కన పెట్టుకోవడం మానేసి, దానికి గుడ్‌నైట్ చెప్పండి.