గుడ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటిని సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. ప్రోటీన్‌ని అందించడంలో గుడ్లు ముందు స్థానంలో ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కోసం కేవలం గుడ్లు పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. మరిన్ని ఆహార ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ కోసమే అందరూ గుడ్లను తింటూ ఉంటారు. మీకు గుడ్డు తినడం ఇష్టం లేకపోతే ప్రోటీన్ కోసం ఇక్కడ చెప్పిన ఆహారాలను ప్రయత్నించండి. ఇవన్నీ కూడా శాఖాహారాలే.
కొమ్ము శెనగలు
భారతీయ ఆహారంలో కొమ్ము శెనగలు భాగమే. చనా అని కూడా వీటిని పిలుస్తారు. వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పురాతన ఈజిప్టులో ఈ కొమ్ము శెనగలను అధికంగా తినేవారు. కేవలం ప్రోటీన్ కోసమే వీటిని తినేవారని చెబుతారు. కాబట్టి మీరు ప్రోటీన్ కోసం కోడిగుడ్లనే తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పిన కొమ్ము శెనగలను కూడా తినవచ్చు. కాబూలీ చనా తిన్నా కూడా మంచిదే.
పనీర్
పన్నీర్ లో కూడా పోషకాహారం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్ నిండుగా ఉంటుంది. ఒక కప్పు పనీర్ తింటే 12 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. అందుకే దీన్ని ప్రోటీన్ పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చు. పనీర్‌ను రకరకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పనీర్ కర్రీ, పనీర్ పరాటా, పనీర్ బిర్యాని ఇలా ఎలా తిన్నా కూడా ప్రోటీన్ శరీరానికి చెందుతుంది. పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.
బాదంపప్పులు
బాదంపప్పులు రోజుకు గుప్పెడు తింటే చాలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంలో ప్రోటీన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. పది బాదం పప్పులు తింటే ఏడు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. బాదం పప్పులు తినడం వల్ల గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. బాదంపప్పుతో బటర్ కూడా తయారు చేసుకోవచ్చు. కొన్ని బాదం పప్పులు, దాల్చిన చెక్క, వెనిల్లా ఎసెన్సు, కరివేపాకులు ఇచ్చి మెత్తగా పేస్ట్ చేసుకుంటే బటర్ రెడీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. ఇవి తినడం కూడా చాలా అవసరం. వీటిని సలాడ్లు, డిజర్ట్ లు, స్మూతీలలో భాగం చేసుకోవచ్చు. లేదా స్నాక్స్ లాగా ప్రతిరోజు గుప్పెడు తినవచ్చు. ఇలా తినడం వల్ల మనకు ఎనిమిది గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అలాగే గుమ్మడికాయ గింజల్లో జింక్, ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటివి కూడా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది. ఓట్ మీల్, గ్రానోల వంటి వాటిలో ఇది కలుపుకొని తింటే టేస్టీగా కూడా ఉంటాయి. ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే వీటన్నింటినీ తినాల్సిందే.
Also Read: పెళ్లి తర్వాత.. ఎందుకు బరువు పెరుగుతారో తెలుసా ?
ఇక్కడ చెప్పినవన్నీ ఆరోగ్యకరమైనవే కాదు రుచిగా కూడా ఉంటాయి. వీటితో మనం రుచికరమైన వంటకాలు కూడా వండుకోవచ్చు. బాదం, గుమ్మడి గింజలను వండాల్సిన అవసరం లేకుండా కూడా తినవచ్చు. ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచి పోషకాలు అందుతాయి.