Neem Spay For Hair Growth: వేపను చాలా కాలంగా చర్మ, జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. మందుల తయారీలో కూడా వేపను ఎక్కువగా వాడుతుంటారు. వీటిలోని పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే నేటికీ వేపను షాంపూ, నూనె, హ్యాండ్ వాష్, సబ్బు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. జుట్టు రాలడం, చుండ్రు, కుదుళ్లు బలహీనంగా మారడం చివర్లు చిట్లడం వంటి అనేక జుట్టు సమస్యలను తొలగించడంలో వేప చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వేప ఆకులతో తయారు చేసిన ఈ స్ప్రే జుట్టు సమస్యకు దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా కుదుళ్లకు కూడా లోతుగా శుభ్రపరుస్తుంది. జుట్టును మూలాల నుండి బలోపేతం చేస్తుంది.
వేప స్ప్రేతో ప్రయోజనాలు:
వేపలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఏ రకమైన ఇన్ఫెక్షన్‌ను తొలగించడంలో నైనా వేప చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తలకు వేపను ఉపయోగించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. అంతే కాకుండా జుట్టు మూలాలపై వేప హెయిర్ స్ప్రేను క్రమం తప్పకుండా స్ప్రే చేస్తే, అది చుండ్రు సమస్య నుండి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది. దురద, మంట సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
వేపను ఉపయోగించడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే ఇంట్లో తయారుచేసిన లేదా హెయిర్ వేప స్ప్రేను ప్రతిరోజూ మీ జుట్టుకు వాడండి. దీంతో 7 రోజుల్లోనే మీరు తేడాను చూస్తారు. ఇది జుట్టు మూలాలకు పోషణనిచ్చి వాటిని బలంగా చేస్తుంది.
తల చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది:
తలపై దుమ్ము, ధూళి పేరుకుపోతే దురద, అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల వంటివి వస్తాయి. దుమ్ము, ధూళి, చెమట కారణంగా తలపై మురికి పేరుకుపోతుంది. ఇలాంటి సమయంలో వేప స్ప్రేను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే.. అది తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ స్ప్రే వాడటం వల్ల తల చల్లబడి, తాజాదనం కలుగుతుంది.
పేలను వదిలిస్తుంది:
పిల్లలు లేదా పెద్దలు పేల సమస్య కలిగి ఉంటే.. వేప హెయిర్ స్ప్రే దానికి ఖచ్చితమైన నివారణ. వేపలో లభించే మూలకాలు పేలను నివారించడంలో, పేను గుడ్లను చంపడంలో ప్రభావవంతంగా ఉంటాయి. జుట్టు మీద వేప స్ప్రేను పూర్తిగా స్ప్రే చేసి, ఆపై దువ్వడం వల్ల సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
వేప హెయిర్ స్ప్రే ఎలా తయారు చేయాలి ?
వేప హెయిర్ స్ప్రే తయారు చేయడం చాలా సులభం. దీనికి చాలా తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి. దీన్ని తయారు చేయడానికి.. ముందుగా కప్పు వేప ఆకులను తీసుకుని బాగా కడగాలి. తర్వాత ఒకటి లేదా రెండు కప్పుల నీటిలో 20 నుండి 25 పచ్చి వేప ఆకులను వేసి తక్కువ మంట మీద 15-20 నిమిషాలు బాగా ఉడికించి, అది బాగా మరిగి ఆకుపచ్చగా మారినప్పుడు , వేప ఆకుల సువాసన రావడం మొదలైనప్పుడు గ్యాస్ ఆపివేయండి. ఇప్పుడు నీటిని చల్లరానివ్వండి. ఈ నీరు చల్లబడిన తర్వాత.. దానిని వడకట్టి, అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఇప్పుడు వేప హెయిర్ స్ప్రే వాడటానికి సిద్ధంగా ఉంది.
Also Read: ట్రెండీ లుక్ కోసం.. కాస్త మేకప్ వేద్దామా ?
ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి ?
వారానికి కనీసం 3 నుండి 4 సార్లు జుట్టుకు వేప స్ప్రే వాడాలి. మీరు తలస్నానం చేయడానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు ఈ వేప హెయిర్ స్ప్రేని ఉపయోగించండి. మీరు దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి.