Sunstroke: ఎండలు మండిపోతున్నాయి. ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం టెంపరేచర్ దడ పుట్టిస్తోంది. ఇప్పటికే 40 డిగ్రీలు దాటిన ఎండలు రాను రాను ఇంకా పెరిగే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎండలు పెరిగే కొద్దీ బయట తిరిగితే వడదెబ్బ తగిలే చాన్స్ ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే వడదెబ్బ తగిలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఉష్టోగ్రతలు 40 డిగ్రీలను రీచ్ అవుతున్నాయి. దీంతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపుతూ చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనానికి అంతరాయం కలుగుతుంది. వేడి తాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉష్ణతాపాన్ని తట్టుకోవడం.. వడదెబ్బ నుంచి రక్షణ పొందడం తప్పనిసరి. ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, కూలీలు నిత్యం ఎండలోనే పనులు చేయడం, వల్ల ఎండ వేడితో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌కు గురై నిస్సత్తువకు గురవుతుంటారు. ఇలాంటి క్రమంలో ఎప్పటికప్పుడు నీరు తాగితూ.. చల్లని పదార్థాలు తీసుకుంటే శరీరానికి సమతుల్యం పాటించినట్లు అవుతుంది.
వడదెబ్బ లక్షణాలు:
సాధారణంగా శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన వేడి శరీరంలోని ఉష్ణ సమతుల్యతను కాపాడే చర్మం ద్వారా చెమట రూపంలో బయటకు పంపబడుతుంది. కానీ.. శరీరం అధిక ఉష్ణోగ్రతకు లేదా డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్షణ మార్గాలైన చర్మం, ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. దీంతో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా అధిక స్థాయికి చేరుతుంది. దీనినే వడదెబ్బ అంటారు. అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడిబారటం, దప్పిక ఎక్కువ కావడం, వాంతులు కావడం, నీరసం, దడ, ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం, కన్‌ఫ్యూజన్, చిరాకు, ఉన్న స్థలము, సమయం తెలియకపోవడం, భ్రమలతో కూడిన ఆలోచనలు కలగడం, చివరిగా స్పృహ కోల్పోవడం లాంటివి వడదెబ్బ లక్షణాలు.
వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
వేసవిలో సాధ్యమైనంత వరకు నీడపట్టున ఉండే విధంగా చూసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనే తీసుకోకూడదు. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలో పటికబెల్లం కలిపి తీసుకోవాలి. కొబ్బరినీళ్లు కొంచెం కొంచెం సేవించాలి. వదులైన తెల్లని దుస్తులు ధరించాలి. దాహంగా అనిపించిన వెంటనే నీళ్లు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, చెరకు రసం ఎక్కువ మేలు చేస్తాయి.
వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన చర్యలు:
వడదెబ్బకు గురైన వ్యక్తికి అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి. శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి. బట్టను చల్లని నీటిలో ముంచి శరీరాన్ని తుడవాలి. ఉప్పు కలిపిన చల్లని నీరు, మజ్జిగ, గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు తాగించాలి. తర్వాత డాక్టర్ ను సంప్రదించాలి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్