వైసీపీని, జగన్ ని ఇటీవల కాలంలో బాగా ఇబ్బంది పెడుతోంది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు షర్మిల. కానీ షర్మిల కంటే మరో వ్యక్తి వైసీపీని ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఆ పేరు చెబితేనే వైసీపీ నేతలు ఇరిటేట్ అయిపోతున్నారు. అతడే సీమరాజా. కేవలం సోషల్ మీడియాలోనే అతను వైసీపీని, జగన్ ని టార్గెట్ చేస్తుంటారు. కానీ ఆ పేరు చెప్పినా, ఆయన చేసే వీడియోలు చూసినా వైసీపీ నేతలకు కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వలేరు. ఇచ్చినా వాటికి బదులుగా మరిన్ని కౌంటర్లు రెడీగా ఉంటాయి. అందుకే అతనంటే వైసీపీకి టెన్షన్ తో కూడిన పగతో వచ్చిన కోపం, భయం. గతంలో అంబటి రాంబాబు కూడా సీమరాజాపై కేసు పెట్టారు. తాజాగా మరోసారి సీమరాజా యూట్యూబ్ అకౌంట్ పై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీమరాజాను అరెస్ట్ చేయండి..
తమ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన భాష వాడుతున్నారని, వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో సీమరాజా యూట్యూబ్ ఛానల్ పై కేసు పెట్టాలని ఆయన కంప్లయింట్ చేశారు. సీమరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గత ఎన్నికల్లో వైసీపీకి డ్యామేజ్..
గత ఎన్నికల ముందు సీమరాజా అనే పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు బాగా ఫేమస్ అయ్యాయి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్ లో వైసీపీని సునిశితంగా విమర్శిస్తూ సీమరాజా పోస్టింగ్ లు పెట్టేవారు. అయితే ఇక్కడ సీమరాజా తన మెడలో వైసీపీ కండువానే వేసుకునేవారు. అంతర్జాతీయ వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ తమ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను జనాలకు అర్థమయ్యేలా చెప్పేవారు. ఎక్కడా జగన్ ని నేరుగా విమర్శించరు కానీ, జగన్ ని మిగతా నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని మాత్రం చెప్పేవారు. గత ఎన్నికల్లో సీమరాజా ద్వారా వైసీపీకి బాగా డ్యామేజీ జరిగింది. హ్యూమరస్ గా ఉండే సీమరాజా వీడియోలు జనాల్లోకి బాగా వెళ్లాయి. మాస్ కి బాగా రీచ్ అయ్యాయి.
ఎన్నికల తర్వాత కూడా..
ఇక ఎన్నికల తర్వాత కూడా సీమరాజా మార్క్ సెటైర్లు ఆగలేదు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఎలా ఉండాలి, కానీ ఎలా ఉంటోంది అంటూ సీమరాజా వీడియోలు చేస్తున్నారు. ఇటీవల కొడాలి నానికి ట్రీట్ మెంట్ చేస్తున్నట్టుగా వేసిన స్కిట్ బాగా వైరల్ గా మారింది. సీమరాజాతో వైసీపీ తెగ ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. దీంతో ఆ అకౌంట్ ని బ్యాన్ చేయాలంటూ వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. గతంలో అంబటి రాంబాబు వంటి నేతలు కూడా ఆ అకౌంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎంతగా తనను టార్గెట్ చేస్తే, అంత ఎక్కువగా రివర్స్ లో అటాక్ చేయడం సీమరాజా స్పెషాలిటీ. అందుకే కొంతమంది సైలెంట్ కాగా, మరికొందరు మాత్రం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చి తమ బాధ చెప్పుకుంటున్నారు. అయితే ఈ అకౌంట్ ద్వారా వెటకారం, వ్యంగ్యం బయటకు వస్తాయి కానీ, ఎక్కడా బూతుల వాడకం, ఘాటు విమర్శలు ఉండవు. అందుకే పోలీసులు కేసుల వరకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లలేదని అర్థమవుతోంది.