Dark Elbows: మనం రోజూ మన ముఖం, చేతులను జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ శరీరంలోని కొన్ని భాగాలు అంటే.. మోకాలు, మోచేతుల వంటి వాటిని అంతంగా పట్టించుకోము. అందుకే ఈ భాగాలు క్రమంగా నల్లగా మారతాయి.
చర్మాన్ని కాంతివంతం చేసే క్రీములు , బ్లీచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి ప్రభావం తాత్కాలికమే.. కొన్నిసార్లు అవి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగిస్తాయి. ఇదిలా ఉంటే హోం రెమెడీస్ ఉపయోగించి కూడా కాళ్లు, మోచేతులపై ఉన్న నల్లదనాన్ని తొలగించుకోవచ్చు. వీటితో చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేసుకోవచ్చు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాళ్లు , మోచేతుల నల్లదనాన్ని తొలగించే మార్గాలు:
నిమ్మకాయ, తేనె మిశ్రమం:
నిమ్మకాయ బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తేనె చర్మాన్ని తేమగా చేస్తుంది. ఈ హోం రెమెడీ కోసం సగం నిమ్మకాయ తీసుకుని.. దానిపై కొంచెం తేనె వేసి.. మీ మోకాళ్లు, మోచేతులపై 5-10 నిమిషాలు రుద్దండి. దీని తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి 3 సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడా, పాలు:
బేకింగ్ సోడా ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా పాలు చర్మానికి పోషణనిస్తాయి. 1 టీస్పూన్ బేకింగ్ సోడాను కొంచెం పాలతో కలిపి పేస్ట్ లా చేసి, చర్మం నల్లగా మారిన ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాయండి.
అలోవెరా జెల్:
అలోవెరాలో చర్మాన్ని బాగు చేసే గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు, అలోవెరా జెల్‌ను మోకాళ్లు, మోచేతులపై అప్లై చేసి.. సున్నితంగా మసాజ్ చేయండి. దీనితో నల్లదనం క్రమంగా తగ్గి చర్మం మృదువుగా మారుతుంది.
కొబ్బరి నూనె ,నిమ్మరసం:
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా నిమ్మకాయ ట్యానింగ్‌ను తొలగిస్తుంది. 1 టీస్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మసాజ్ చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత వాష్ చేయండి. ఈ హోం రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించడం ద్వారా మోచేతులు, మోకాళ్లపై ఉన్న నలుపుదనం పూర్తిగా తొలగిపోతుంది.
Also Read: ముఖంపై మొటిమలు.. ఏం చెబుతున్నాయో తెలుసుకుందామా ?
పసుపు, పాలు, శనగపిండి పేస్ట్:
పసుపులో క్రిమినాశక, చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఉంటాయి. 1 టీస్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు , కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని మోకాళ్లు , మోచేతులపై అప్లై చేయండి. అది ఆరిన తర్వాత.. సున్నితంగా రుద్ది శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మోచేతులపై ఉన్న జిడ్డు పూర్తిగా తొలగి పోతుంది.
ఈ హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. హోం రెమెడీస్ వాడుతున్నాం కాబట్టి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అంతే కాకుండా తక్కువ సమయంలోనే మీరు సమస్య నుండి ఈజీగా బయటపడతారు.