Fenugreek Oil: ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఒత్తుగా, బలంగా, మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి బిజీ జీవితం, కాలుష్యం , చెడు ఆహారపు అలవాట్ల కారణంగా, జుట్టు రాలడం, సన్నబడటం ఒక సాధారణ విషయంగా మారింది. మీరు కూడా ఈ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. అస్సలు భయపడకండి.
జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి మెంతి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్ , ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అంతే కాకుండా వాటి పెరుగుదలకు కూడా ఎంతగానో మేలు చేస్తాయి. తలపై ఉన్న చర్మాన్ని బలోపేతం చేస్తాయి. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మెంతి నూనెను ఎలా తయారు చేయాలో, మెరుగైన ఫలితాల కోసం దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మెంతి నూనె ఎలా తయారు చేయాలి ?
మెంతి నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీన్ని వాడటం వల్ల చుండ్రు నుంచి తక్కువ సమయంలోనే ఉపశమనం లభిస్తుంది. మెంతులు జుట్టు సహజంగా నల్లగా, మందంగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి. ఈ నూనె తలకు తేమను కూడా అందిస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా తొలగిస్తుంది.
మెటీరియల్:
1 కప్పు- మెంతులు
1 కప్పు- కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె
తయారీ విధానం:
ముందుగా.. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. దీనివల్ల వాటిలో ఉండే పోషకాలు నూనెలో సులభంగా కలిసిపోతాయి. మరుసటి రోజు, నానబెట్టిన మెంతులను నీటిలోంచి తీసి.. మెత్తగా పేస్ట్ తయారు చేసుకోండి. ఒక పాన్‌లో కొబ్బరి లేదా ఆవాల నూనె వేడి చేసి, నూనె గోరువెచ్చగా అయిన తర్వాత దానిలో మెంతుల పేస్ట్ వేయండి. తర్వాత తక్కువ మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి. నూనె రంగు కొద్దిగా మారడం ప్రారంభించి..మెంతుల వాసన రావడం ప్రారంభించినప్పుడు.. గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు నూనెను చల్లారనివ్వండి. అనంతరం శుభ్రమైన క్లాత్ లేదా జల్లెడ ద్వారా దానిని ఫిల్టర్ చేయండి. ఈ నూనెను గాలి చొరబడని సీసాలో నిల్వ చేయండి. ఈ నూనె 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది.
జుట్టుకు మెంతి నూనెను ఎలా అప్లై చేయాలి ?
నేరుగా నూనె వాడండి:
మెంతి నూనెను తేలికగా వేడి చేసి.. మీ వేళ్లతో మసాజ్ చేయడం ద్వారా తలకు అప్లై చేయండి. 30 నిమిషాల నుంచి 1 గంట వరకు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో జుట్టును వాష్ చేయండి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. నోటి పూతకు గుడ్ బై
మెంతి నూనె, పెరుగుతో హెయిర్ మాస్క్:
4 టీస్పూన్ల మెంతి నూనె, చిన్న కప్పు టీస్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేయండి.
దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఈ మాస్క్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
మెంతి నూనె , అలోవెరా జెల్:
తగినంత మోతాదులో మెంతి నూనెను కలబంద జెల్ తో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయి. అంతే కాకుండా చుండ్రు కూడా తొలగిపోతుంది.