Rapthadu Incident: ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజులకు క్రితం చోటు చేసుకున్న ఘటన అందరిని భయాందోళనలకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడులో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గోపికపై హేమంత్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణా రహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో ఎంతోమంది సినిమాలను చూసి స్ఫూర్తిగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు కురిపించారు.
ఈ తరహా క్రైమ్ సినిమాలను దర్శకనిర్మాతలు అరికడితేనే సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వగలిగిన వారవుతారు అంటూ ఈ ఘటన పట్ల ఎంతో మంది వారి అభిప్రాయాలను తెలిపారు. అయితే రాప్తాడు ఘటనలో భాగంగా హేమంత్ రంపంతో దాడి చేయడంతో ఈ ఘటన అచ్చం మార్క్ ఆంటోనీ సినిమాని పోలి ఉందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించారు. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య 1990 కాలంలో చేతిలో పవర్ రంపం చేతిలో పట్టుకొని శత్రువులను వేటాడే ఒక సైకో పాత్రలో కనిపించారు.
ఇలాంటి సినిమాలను ఆధారంగా తీసుకుని రాప్తాడు నిందితుడు హేమంత్ లాంటివాళ్ళు నిజ జీవితంలో కూడా క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇకపై దర్శక నిర్మాతలు హింసాత్మక ఘటనలకు సంబంధించిన సన్నివేశాలను పరిధికి మించి పెట్టకపోవడమే మంచిదని ఇలాంటి విషయాలలో ఇప్పటికైనా దర్శక నిర్మాతలు మేల్కొని సమాజానికి స్ఫూర్తిదాయకమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని పలువురు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన సినిమాలు, స్మగ్లింగ్, దొంగతనాలు సంబంధించిన సినిమాలు విడుదల కావడంతో ఇలాంటి సినిమాల పట్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనాలను కల్పిస్తున్నారు అంటూ వ్యతిరేకత ఏర్పడింది. ఈ విషయం పట్ల మరి కొంతమంది సినీ ప్రేమికులు స్పందిస్తూ .. సినిమాను సినిమాలా మాత్రమే చూసి ఎంజాయ్ చేస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రాప్తాడు ఘటన దర్శక నిర్మాతలకు కూడా ఒక హెచ్చరిక లాంటిదని చెప్పాలి.
Also Read: ఎలిమినేషన్ తర్వాత రోహిత్ ఫస్ట్ పోస్ట్ చూసారా?ఎంత క్యూట్ గా ఉందో!