మీటింగ్ అవుతున్నప్పుడు, ఏదైనా వేడుకల సమయంలో తుమ్ము వస్తే ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు కొంతమంది. ఆ సమయంలో తుమ్మును ఆపేందుకు ప్రయత్నిస్తారు. అలా తుమ్మును ఆపడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది. తుమ్ము అనేది శరీరంలోని సహజ ప్రతి చర్యలలో ఒకటి.
తుమ్ము రావడానికి కారణం
తుమ్ము రావడం అనేది మంచిదే. శరీరం తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రక్రియల్లో తుమ్ము ఒకటి. బయట నుంచి వచ్చే కణాలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలను ముక్కు నుంచి శరీరం నుంచి బయటికి పంపించేందుకు తుమ్మును వచ్చేలా చేస్తుంది. అలాంటి తుమ్మును అణిచివేయడం అనేది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. తుమ్ముతున్నప్పుడు శరీరం లోపల తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి పోవాలంటే తుమ్మాలి. అలా కాకుండా తుమ్మకుండా ఈ ఒత్తిడిని శరీరంలోనే ఉంచడం వల్ల అది చెవులు, గొంతు, కళ్ళను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.
ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చు
తుమ్మును ఆపడం వల్ల చెవులకు తీవ్ర నష్టం జరగవచ్చు. చెబిపోటు రావచ్చు. కర్ణభేరి పగిలిపోయి పూర్తిగా చెవిటివారు కావచ్చు. రక్తనాళాలు పగిలి అంతర్గత రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది. సైనసైటిస్, మైగ్రేన్లు వంటివి చీలే అవకాశం ఉంది. ఎన్నో సందర్భాల్లో తుమ్మును ఆపిన వారికి అంతర్గత రక్తస్రావం జరిగిన సందర్భాలు ఉన్నాయి. తుమ్మును ఆపడం అనేది ఆవిరితో నిండిన బాయిలర్ పేలుడుకు సమానమైన ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మీకు తుమ్ము వస్తున్నట్లు అనిపిస్తే దానిని ఆపకండి… తుమ్మేయండి .ఇతరుల పట్ల గౌరవం కోసమో, మర్యాద కోసమో మీరు తుమ్మును ఆపుకుంటే మీ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నట్టే. నలుగురిలో తుమ్మడం తప్పేమీ కాదు. వారికి కూడా తుమ్ము వస్తే మీలాగా ఆపుకోకపోవచ్చు. నలుగురిలో ఉన్నప్పుడు తుమ్మడం కష్టంగా అనిపిస్తే మీ నోరు లేదా ముక్కుకు ఒక టిష్యూను లేదా రుమాలును అడ్డుపెట్టుకొని తుమ్మేయండి. అంతేతప్ప తుమ్ములు మాత్రం ఆపకండి. తుమ్ములు సహజంగా రావడం అనేది మీ శరీర భద్రతనే సూచిస్తుంది.
తుమ్ములు రాకపోతే శరీరంలో చేరిన చాలా వైరస్, బ్యాక్టీరియా, గాలిలోని కాలుష్య కణాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఊపిరితిత్తులకు అవన్నీ పట్టి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి తుమ్ము రాగానే ఆలోచించకుండా ఆ పని కానివ్వండి.