Hyderabad Metro: భాగ్యనగరం హైదరాబాద్‌కు తలమానికంగా నిలుస్తోంది మెట్రో రైలు. ఇప్పుడు మెట్రోరైలుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా సెక్టార్‌లో ఇచ్చే ‘ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్’-2025 పురస్కారాల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల నుంచి 1900కు పైగా సంస్థలు సుమారు 500 ఎంట్రీలు వచ్చాయి. వాటిలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్-L&TMRHL ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మెట్రో రైలు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు రూపొందించిన ‘ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్’కు గాను ఈ గుర్తింపు దక్కింది.
ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ సిటీలో జరిగిన ప్రతిష్టాత్మక UITP అవార్డ్స్-2025 ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు అవార్డుతో సత్కరించబడింది . రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ -RTA సహకారంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టును ఆపరేషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో సమర్పించడం, డేటా ఆధారిత విధానాలతో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచినందుకుగాను ఫలితం దక్కింది.
ఈ కేటగిరీలో హైదరాబాద్ మెట్రో టాప్-5లో ఒకటిగా నిలిచింది. మెట్రోకు ప్రత్యేక గుర్తింపు వచ్చిన విషయాన్ని ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు. నగరాల్లోని రవాణాలో అత్యుత్తమ విధానాలు పాటిస్తున్న సంస్థలకు యూఐటీపీ ఏటా పురస్కారాలు అందజేస్తుంది. మా వినూత్న వ్యూహాలు.. నిర్వహణ సామర్థ్యాలతో హైదరాబాద్ మెట్రోను ప్రపంచ వేదికపై నిలపడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
ALSO READ: నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుకింగ్, సరికొత్త పీఆర్ఎస్ వ్యవస్థ
అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడం నాణ్యమైన సేవలకు నిదర్శనమని అంటున్నారు. ప్రపంచంలో అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో గ్లోబల్ స్టేజ్ లో నిలవడం గర్వకారణమన్నారు. ఇదిలావుండగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది.ఫేజ్-2బీ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. మెట్రో విస్తరణకు సంబంధించి ఇంజినీర్లు, నిపుణులు రూపొందించిన డీపీఆర్‌ను ఇటీవల కేంద్రానికి పంపించారు.
అక్కడ ఆమోద ముద్ర పడాల్సివుంది. ప్రస్తుతం పాతబస్తీకి మెట్రో విస్తరణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ.125 కోట్లు విడుదల చేసింది. రెండో దశ పనులు పూర్తయితే సిటీలో పలు ప్రాంతాల వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇటీవల హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది. తక్కువ సమయంలో ఇంటికి చేరుకోవడంతో నగరవాసులకు మెట్రో రైలుని ఆశ్రయిస్తున్నారు.