నిజానికి వేప ఆకులతో చాలా సులభంగా చుండ్రును తొలగించుకోవచ్చు. తాజా వేప ఆకులను ఏరి పరిశుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయండి. తల మొత్తం ఈ ఆకులను పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో తలకు స్నానం చేయండి. ఇది మొండి చుండ్రును తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. చుండ్రు అధికంగా బాధపడుతున్న వారు వారానికి రెండుసార్లు ఇలా వేప పేస్టుని తలకి పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లబరచండి. షాంపూ తలకు చేసిన తర్వాత ఈ వేప కలిపిన నీటిని తలపై వేసి బాగా మర్దనా చేసుకోండి. ఇది చుండ్రును, దురదను చాలా వరకు తగ్గిస్తుంది. తలను పరిశుభ్రంగా ఉంచుతుంది. అలాగే తాజాగా కూడా అనిపిస్తుంది.
వేప ఆకులతోనే కాదు వేప నూనెతో కూడా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. వేప నూనెను కొబ్బరి నూనెతో కలిపి తలకు సున్నితంగా మసాజ్ చేయండి. వేప నూనె కాస్త చెడు వాసన వస్తుంది. అయినా సరే.. అది మేలే చేస్తుంది. వేప నూనె, కొబ్బరి నూనె కలిపిన మిశ్రమం తలకు పోషణను అందిస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. చుండ్రును సమర్థవంతంగా నివారిస్తుంది. ఒక గంట ముందు ఇలా నూనెను పట్టించి తర్వాత జుట్టును వాష్ చేసుకోవాలి.
వేప హెయిర్ మాస్క్
వేప ఆకులతో హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. వేప ఆకుల పేస్టును పెరుగు లేదా కలబందలో జెల్ లో కలిపి హెయిర్ మాస్క్ గా తలకి అప్లై చేయండి. తలపై ఉన్న మాడుకి తగిలేలా ఈ పేస్టును రాయాలి. ఇది నెత్తి మీద ఉన్న తేమను కాపాడేందుకు సహాయపడుతుంది. చుండ్రుకు ప్రధాన కారణం అక్కడ ఉన్న చర్మం పొడిబారిపోవడమే. కాబట్టి అక్కడ ఉన్న చర్మాన్ని తేమవంతం చేయడం ద్వారా చుండ్రు చేరకుండా వేప హెయిర్ మాస్క్ అడ్డుకుంటుంది.
వేప ఆకులను ఎండబెట్టి పొడిలా చేసి దాచుకోవచ్చు. తేలికపాటి షాంపూలలో ఈ పొడిని కలిపి తలకు పట్టించవచ్చు. ఇలా చేయడం వల్ల తల చర్మం శుభ్రపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దురద, చుండ్రు వంటివి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. వారానికి రెండు మూడు సార్లు ఇలా వేప కలిపిన షాంపూను వాడడం వల్ల జుట్టు శుభ్రపడడంతో పాటు చుండ్రు సమస్యలన్నీ తొలగిపోతాయి.
వేప ఆకుల ఎలర్జీ చాలా తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి దాదాపు అందరూ ఈ వేప ఆకులను తలకు ఉపయోగించవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది.