బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియగా భావిస్తారు. ఇప్పుడు ఊబకాయం, అధిక బరువు అనేది పెద్ద సమస్యలుగా మారాయి. బరువు పెరగడం సులువే కానీ బరువు తగ్గడానికి మాత్రం కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. నిజానికి కఠినంగా ప్రయత్నిస్తే బరువు తగ్గడం సులువే. ఆహారం తినకుండా బరువు తగ్గాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా ఆహారాన్ని తింటూ కూడా బరువు తగ్గొచ్చు. ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోండి. కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తగ్గించండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తింటే బరువు సులువుగా తగ్గుతారు.
డైటరీ ఫైబర్‌ను ఫైబర్ అనే పిలుచుకుంటారు. ఇది మొక్కల ఆధారిత ఆహారాల్లో కనిపించే ఒక కార్బోహైడ్రేట్. ఇతర కార్బోహైడ్రేట్ ల మాదిరిగా కాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.
ఫైబర్‌లో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి కరిగే ఫైబర్, రెండోది కరగని ఫైబర్. కరిగే ఫైబర్ అంటే నీటిలో కరిగి కొలెస్ట్రాల్‌ను, తగ్గించడంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఇది ఓట్స్, పండ్లు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి వాటిలో దొరుకుతుంది. ఇక నీటిలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది తృణధాన్యాలు, నట్స్ కూరగాయల్లో లభిస్తుంది. ఇది కూడా మలబద్ధకాన్ని నివారించే ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాలను పూర్తిగా మానేయండి. బంగాళదుంపలు, బియ్యము వంటి కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను పూర్తిగా తగ్గించండి. మైదా వంటి ఆహారాలను తినడం మానేయండి. అంతగా మీకు తినాలనిపిస్తే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటివి మితంగా తీసుకోండి. ఓట్స్ అధికంగా తింటే ఎంతో మంచిది. ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
కాయధాన్యాలు అంటే పప్పులు, కొమ్ము శెనగలు, కిడ్నీ బీన్స్, బఠానీలు వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని కూరల్లాగా సలాడ్లలాగా మార్చుకొని తినండి. పాలకూర, క్యారెట్లు బీన్స్, గుమ్మడికాయ వంటి వాటిలో కూడా ఫైబర్ ఎక్కువే. వీటితో కూరలు వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. అలాగే జామ, బొప్పాయి, ఆపిల్స్, నారింజ వంటివి తింటే బరువు త్వరగా తగ్గుతారు. అలాగే బాదం, వాల్‌నట్స్, చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిని పెరుగులో కలుపుకొని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కార్బోహైడ్రేట్లే మీరు బరువు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి వాటిని తగ్గించడం ద్వారా బరువును అదుపులో పెట్టుకోవచ్చు.
Also Read: సోరియాసిస్ అంటు వ్యాధా? అది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా?