Parenting Tips: మీరు ఎప్పుడైనా కోపంలో మీ పిల్లలపై అరిచి, ఆ తర్వాత బాధపడ్డారా? పని ఒత్తిడి, అలసట లేదా ఇతర సమస్యల కారణంగా కొన్నిసార్లు పిల్లలపై కోపం చూపిస్తుంటారు. తప్పు మనదేనని తెలిసినా చాలామంది తల్లిదండ్రులు సారీ చెప్పడానికి అంటే క్షమాపణ అడగడానికి వెనుకాడతారు. అలా చెబితే పిల్లలు తమను తక్కువగా చూస్తారని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి. పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పించాలనుకునే మనమే తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోకపోతే ఎలా? తల్లిదండ్రులు చెప్పే ఒక చిన్న క్షమాపణ పిల్లల మనసులో జీవితాంతం నిలిచిపోయే మంచి పాఠంగా మారుతుంది.
చాలామంది తల్లిదండ్రులు క్రమశిక్షణ అంటే పిల్లలు చెప్పిన మాట వినడమే అనుకుంటారు. కానీ మంచి పేరెంటింగ్ అంటే కేవలం నియంత్రించడం కాదు. పిల్లల భావాలను అర్థం చేసుకోవడం, ప్రేమగా మాట్లాడటం కూడా ఇందులో భాగమే. మీరు పిల్లలపై అనవసరంగా అరిచినప్పుడు, ఆ తప్పును అంగీకరించండి. ‘నిన్ను అలా అరిచి ఉండకూడదు. నన్ను క్షమించు’ అని చెప్పండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు బాధ్యత, గౌరవం, తప్పులను సరిదిద్దుకోవడం వంటి విలువలు అర్థమవుతాయి.
పిల్లల వయసును బట్టి వారి ఆలోచనా విధానం మారుతుంది. అందుకే క్షమాపణ చెప్పే విధానం కూడా మారాలి.
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు: చిన్న చిన్న మాటల్లో క్షమాపణ చెప్పాలి. ‘నేను గట్టిగా అరిచాను. నీకు భయం వేసి ఉంటుంది. నన్ను క్షమించు’ అని చెప్పండి.
6 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు: మీ తప్పుకు కారణం వివరించండి. ‘పని ఒత్తిడి వల్ల నీపై కోపం చూపించాను. అలా చేయడం తప్పు. మరోసారి కోపం వస్తే ప్రశాంతంగా ఉంటాను’ అని చెప్పండి.
టీనేజర్లకు: వారి ఆత్మగౌరవాన్ని గౌరవించాలి. ‘నువ్వు నన్ను కోపానికి గురిచేశావు’ అంటూ తప్పును పిల్లలపై నెట్టకూడదు. మీ తప్పును నిజాయితీగా అంగీకరించాలి.
తల్లిదండ్రులను చూసే పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. పెద్దలు తమ తప్పులను అంగీకరిస్తే, పిల్లలు కూడా నిజాయితీగా ఉండటం నేర్చుకుంటారు. అంతేకాదు, తమ భావాలను బయటపెట్టడం, ఇతరులను అర్థం చేసుకోవడం, తప్పులకు బాధ్యత తీసుకోవడం వంటి మంచి లక్షణాలు పెరుగుతాయి. అయితే ప్రతి విషయంలోనూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నిద్రపోయే సమయం, చదువు, మొబైల్ వాడకం వంటి విషయాల్లో పెట్టే సరైన నియమాలను కొనసాగించాలి.
Also Read: పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వకుండా వారి ప్రతి అడుగుపై నిఘా పెడుతున్నారా? ఈ సమస్యలు తప్పవు
1. ముందుగా ప్రశాంతంగా ఉండండి: కోపం తగ్గిన తర్వాతే పిల్లలతో మాట్లాడండి.
2. మీ తప్పును అంగీకరించండి: ఎలాంటి సాకులు చెప్పకుండా క్షమాపణ కోరండి.
3. వారి బాధను అర్థం చేసుకోండి: మీ మాటల వల్ల వారు ఎంత బాధపడ్డారో గుర్తించండి.
4. సమస్యను విడిగా చర్చించండి: పిల్లల తప్పు గురించి మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన సమర్థించుకోకండి.
5. మార్పును చూపించండి: మరోసారి కోపం వచ్చినప్పుడు ఎలా నియంత్రించుకుంటారో చెప్పండి.
6. ప్రేమను తెలియజేయండి: ‘నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని భరోసా ఇవ్వండి.
Also Read: మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..
మనుషులు తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పాలి. ఈ మంచి గుణాలను పిల్లలకు తల్లిదండ్రులు నేర్పడం అవసరం. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల అలవాట్లు చూసే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకోవడం చేస్తే పిల్లలు కూడా పెద్దలను అనుసరించి నేర్చుకుంటారు.