Big Tv Originals: కిచెన్ లో ఉండే కామన్ వెజిటెబుల్స్ లో ఉల్లిగడ్డలు ఒకటి. ఇంట్లో ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఈ ఉల్లిగడ్డలు అప్పుడప్పుడు మొలకెత్తుతాయి. చాలా మంది మొలకలను కట్ చేసి వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇంతకీ మొలకెత్తిన ఉల్లిగడ్డలను తినొచ్చా? ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏం చెప్తున్నారు? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఉల్లిగడ్డలు ఎందుకు మొలకెత్తుతాయి?
ఉల్లిగడ్డలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు లేదంటే తేమ, వెచ్చదనం తగిలినప్పుడు మొలకెత్తుతాయి. ఉల్లిగడ్డ మీద పచ్చటి మొలకలు వస్తాయి. ఉల్లిగడ్డలు మొలకెత్తడం వల్ల తన రూపంతో పాటు రుచిలోనూ తేడా ఉంటుంది. అంతేతప్ప ఆరోగ్యానికి హానికరం కాదు. తాజా ఉల్లిగడ్డలు గట్టిగా ఉంటాయి. కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. మొలకెతిన ఉల్లిగడ్డలు దాని దృఢత్వాన్ని కోల్పోయి, మరింత ఘాటుగా, కాస్త చేదు రుచిని కలిగి ఉంటాయి. ఉల్లిగడ్డ మొలకెత్తే ప్రక్రియకు ఇంధనంగా నిల్వ చేసిన పోషకాలను ఉపయోగిస్తుంది. సో, రుచిలో తేడా ఉంటుంది. పచ్చి రెమ్మలు పచ్చి ఉల్లిగడ్డల మాదిరిగానే కొద్దిగా ఘాటైన రుచిని కలిగి ఉంటాయి.
మొలకెత్తిన ఉల్లిగడ్డల్లో పోషక విలువలు
మొలకెత్తిన ఉల్లిగడ్డలు అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కొన్ని అధ్యయనాలు మొలకెత్తే ప్రక్రియలో ఉన్న ఉల్లిగడ్డల్లో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుందని వెల్లడించాయి. అంటే, మొలకెత్తిన ఉల్లిగడ్డలు అనుకున్న దానికంటే ఎక్కువ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
మొలకెత్తిన ఉల్లిగడ్డలను ఎలా ఉపయోగించాలి?
మీ కిచెన్ లో మొలకెత్తిన ఉల్లిగడ్డలు ఉంటే.. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ మొలకలను తీసివేయండి: ఒకవేళ ఉల్లిగడ్డలు మొలకెత్తితో వాటిన కత్తిరించాలి. మిగతా ఉల్లిగడ్డలను సాధారణంగానే ఉపయోగించుకోవచ్చు.
⦿ మొలకలను వాడుకోవచ్చు: ఉల్లిగడ్డలు మొలకెత్తినప్పుడు వచ్చిన పచ్చి రెమ్మలు పూర్తిగా తినవచ్చు. వాటిని సలాడ్ లు, స్టైర్ ఫ్రైస్, సూప్ లలోనూ ఉపయోగించుకోవచ్చు.
⦿ ఉడికించడం మంచిది: మొలకెత్తిన ఉల్లిగడ్డలను ఉడికించడం వల్ల దాని చేదు తగ్గే అవకాశం ఉంటుంది.
మొలకెత్తిన ఉల్లిగడ్డలను ఎప్పుడు తినకూడదంటే?
మొలకెత్తిన ఉల్లిగడ్డలు సురక్షితం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటిని తినకూడదు. మెత్తగా మారి కుళ్లిపోయినట్లు వాసన వస్తే వాటిని తినకూడదు. ముదురు మచ్చలు, బూజు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటల్లో వినియోగించకూడదు.
Read Also: చైనాలో కొత్త కరోనా వైరస్, ప్రపంచాన్ని నాశనం చేసేలా ఉన్నారుగా మాస్టారూ?
ఉల్లిగడ్డలు మొలకెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉల్లిపాయలు మొలకెత్తకుండా ఉండాలంటే మంచి వెంటిలేషన్ ఉన్న చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. బంగాళాదుంపల దగ్గర ఉల్లిపాయలను ఉంచకూడదు. బంగాళాదుంపలు తేమ, వాయువులను విడుదల చేస్తాయి. ఇవి ఉల్లిపాయ మొలకెత్తడాన్ని ఉపయోగపడుతాయి. కొనుగోలు చేసిన వారం లోపు ఉల్లిగడ్డలను ఉపయోగించడం మంచిది. దీర్ఘకాలిక నిల్వ అనేది మంచిది కాదు. సో, ఇకపై మీ ఇంట్లో మొలకెత్తిన ఉల్లిగడ్డలు కనిపిస్తే, వాటిని చక్కగా తినవచ్చు. ఒకవేళ కుళ్లిపోతే మాత్రమే బయటపడేయాలి.
Read Also: ఉల్లి గడ్డలను ఇలా అస్సలు తినకండి, లేదంటే క్యాన్సర్ రావడం పక్కా!