Anti-glare glasses: డిజిటల్ యుగంలో కంప్యూటర్ స్క్రీన్లతో ఎక్కువ సమయం గడపడం సాధారణ విషయంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య యూజర్లు లాప్టాప్ లేదా డెస్క్టాప్ ముందు గంటల తరబడి ఉండడంవల్ల కళ్లపై ఒత్తిడి,అసౌకర్యం, దీర్ఘకాలిక చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి యాంటీ-గ్లేర్ గ్లాసెస్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని చెప్పుకోవచ్చు.
స్క్రీన్ గ్లేర్ సమస్య అంటే ఏంటి?
స్క్రీన్ మీద కాంతి పడి ప్రతిబింబించడం వల్ల గ్లేర్ వస్తుంది. దీనివల్ల కళ్లకు ఒత్తిడి ఏర్పడి డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటివి తలెత్తవచ్చు. తలనొప్పి, చూపు మసకబారడం, కళ్లు ఎండిపోవడం, మెడ లేదా భుజాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజుకు నాలుగు గంటలకు పైగా స్క్రీన్ ముందు గడిపే 70% మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
కృత్రిమ లైటింగ్, సూర్యకాంతి, లేదా స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఈ గ్లేర్‌ను మరింత తీవ్రం చేసి తాత్కాలిక అసౌకర్యంతో పాటు, దీర్ఘకాలిక మయోపియా లేదా కళ్ల అలసట వంటి సమస్యలు కలిగిస్తుంది.
ఎలా పనిచేస్తాయి?
యాంటీ- గ్లేర్ గ్లాసెస్‌లో ఒక ప్రత్యేక కోటింగ్ వల్ల ప్రతిబింబాలు తగ్గించి కళ్లలోకి వచ్చే కాంతి తీవ్రతను అదుపులో ఉంచుతుంది. ఈ కోటింగ్, బ్లూ లైట్ ఫిల్టరింగ్ టెక్నాలజీతో కలిసి, కఠినమైన కాంతిని చెదరగొట్టి, స్క్రీన్ కాంట్రాస్ట్‌ను పెంచుతుంది. దీనివల్ల టెక్స్ట్ లు, ఇమేజ్‌లు స్పషంగా కనిపించడమే కాక డిజిటల్ స్క్రీన్ల సమస్యలను కూడా పరిష్కరిస్తాయని కంటి వైద్యులు చెబుతున్నారు.
కొన్ని యాంటీ-గ్లేర్ గ్లాసెస్‌లో యూవీ ప్రొటెక్షన్, స్వల్ప టింట్ లాంటి అదనపు ఫీచర్లు ఉండడం వల్ల కళ్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ-గ్లేర్ గ్లాసెస్ ప్రయోజనాలు
గ్లేర్ తగ్గడం వల్ల కళ్లు ఎప్పటికి కాంతి మార్పులకు అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేకపోవడం వల్ల అలసట, అసౌకర్యం తగ్గుతాయి.
చూపు స్పష్టత పెరుగుతుంది: కాంట్రాస్ట్ పెరగడం ప్రతిబింబాలు తగ్గడం వల్ల టెక్స్ట్, ఇమేజ్ లు స్పష్టంగా కనిపించి ఫోకస్, పని ఉత్పాదకతను పెంచుతాయి.
యాంటీ-గ్లేర్ గ్లాసెస్ హానికరమైన బ్లూ లైట్‌ను ఫిల్టర్ చేసి నిద్రలేమి, రెటీనా డ్యామేజ్ వంటి సమస్యలను తగ్గిస్తుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ గ్లాసెస్‌ను క్రమం తప్పకుండ ఉపయోగిస్తే, స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే చూపు సమస్యల ప్రమాదం తగ్గుతుంది.
కంప్యూటర్ పనితో పాటు, గేమింగ్, వీడియోలు చూడటం వంటి ఇతర యాక్టివిటీలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఎవరు వాడాలి?
డిజిటల్ డివైస్‌ల ముందు ఎక్కువ సమయం గడిపే వారు వీటిని ఉపయోగించవచ్చు. ఆఫీస్ ఉద్యోగులు, ప్రోగ్రామర్లు, విద్యార్థులు లేదా బ్రౌజింగ్, స్ట్రీమింగ్ చేసే వాళ్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా లైటింగ్ ఉన్న చోట్ల పనిచేసే వాళ్లకు, కాంతికి సెన్సిటివ్‌గా ఉన్నవాళ్లకు ఇవి చాలా అవసరం.
డాక్టర్‌లు ఈ గ్లాసెస్‌ను 20-20-20 రూల్ (ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో చూడటం), సరైన స్క్రీన్ ఎర్గోనామిక్స్ కలిపి వాడమని సిఫారసు చేస్తారు.
సరైన గ్లాసెస్ ఎలా ఎంచుకోవాలి?
యాంటీ-గ్లాసెస్ ను ఎంచుకునేటప్పుడు లెన్స్ క్వాలిటీ, ఫ్రేమ్ కంఫర్ట్, బ్లూ లైట్ బ్లాకింగ్ లాంటి ఫీచర్లను చూడాలి. ప్రిస్క్రిప్షన్, నాన్-ప్రిస్క్రిప్షన్ వంటి రెండు ఆప్షన్లు ఉన్నాయ్. చూపు సమస్యలు ఉన్నవారు కంటి వైద్య నిపుణుల సలహా మేరకు మీ కంటి ఆరోగ్యానికి తగిన గ్లాసెస్ ఎంచుకోవచ్చు.
పెరుగుతున్న ట్రెండ్:
రిమోట్ వర్క్, ఆన్లైన్ లర్నింగ్ వంటి వాటి వల్ల యాంటీ-గ్లేర్ గ్లాసెస్‌కు డిమాండ్ బాగా పెరిగింది. కొన్ని కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా వీటిని అందిస్తున్నాయి. డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది