Natural Herb: యూకలిప్టస్ చెట్టును జామాయిల్, నీలగిరి అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఆకులు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి వాసన మాత్రమే కాకుండా, దీని ఔషధ గుణాలు కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో పాటు చర్మ సమస్యలను దూరం చేయడం వరకు యూకలిప్టస్ వల్ల అనేక లాభాలు ఉన్నాయని అంటున్నారు. దీని వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
శ్వాసకోశ సమస్యలను తగ్గించేందుకు నీలగిరి ఆకులు సహాయపడతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకలిప్టస్ ఆకుల నుంచి తీసిన నూనెలో ఉండే ‘సినియోల్’ (Cineole) అనే కెమికల్ శ్వాసనాళాలను విశాలంగా చేస్తుందట. దీని వల్ల శ్వాస తీసుకోవడాన్ని సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేడి నీళ్లలో నీలగిరి ఆకులను వేసుకొని స్నానం చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుందట.
అంతేకాకుండా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి తీసుకుంటే ముక్కుదిబ్బడ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. యూకలిప్టస్ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. వైరస్, బాక్టీరియా వంటివి శరీరంపై దాడి చేయకుండా రక్షణ కల్పించడంలో ఇవి సహాయపడుతుందట.
యూకలిప్టస్ ఆకుల నూనెను నేరుగా చర్మంపై మర్దనా చేయడం వల్ల జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు, ఆర్తరైటిస్ వంటివి తగ్గిపోతాయట. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యూకలిప్టస్ ఆకులలో యాంటీసెప్టిక్ లక్షణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చిన్న చిన్న గాయాలు, మచ్చలు, ఇన్‌ఫెక్షన్లను తగ్గించేందుకు ఈ ఆకుల పసరు సహాయపడుతుందని అంటున్నారు. ఈ ఆకుల నూనెతో మర్దనా చేయడం వల్ల చర్మంపై ఉండే చెడు బాక్టీరియా తొలగిపోతుందట. అంతేకాకుండా మొటిమలు, చర్మం మీద మచ్చలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
యూకలిప్టస్ వాసన శరీరాన్ని ఉల్లాసపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం లేదా యోగా సమయంలో యూకలిప్టస్ నూనెను డిఫ్యూజర్ ద్వారా వాడడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందట. దీంతో మానసిక స్థిరత్వం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: టమాట తినకుంటే ఎన్ని బెనిఫిట్స్ మిస్ అవుతారో..!
యూకలిప్టస్ ఆకుల నూనెను పేస్ట్‌లలో, మౌత్‌వాష్‌లలో ఉపయోగిస్తారు. ఇది నోటి దుర్వాసనను తొలగించడమేకాకుండా దంత సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుందట. దంతాల మధ్య ఉన్న బ్యాక్టీరియాను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.