3 day fast: మూడు రోజులు ఉపవాసం అంటే 72 గంటల పాటు ఆహారం తినకుండా, సాధారణంగా నీళ్లు మాత్రమే తాగడం. ఆరోగ్యం, ఆధ్యాత్మికత కారణాలుగా చూపుతూ చాలా మంది ఈ పద్ధతిపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సమయంలో శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఆరోగ్యపరంగా కలిగే లాభాలేంటి?
ఎందుకు చేస్తారు?
కొందరు బరువు తగ్గడానికి ఉపవాసాలు చేస్తుంటారు. దీనివల్ల కొవ్వు కరుగుతుంది. కొందరు మైండ్ క్లారిటీ, ఆధ్యాత్మిక కారణాల కోసం, మతపరమైన ఆచారాల్లో భాగంగా చేస్తారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుందని, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
గ్లూకోస్
మొదటి రోజు ఆహారం తీసుకోకపోవడాన్ని శరీరం గమనిస్తుంది. సాధారణంగా, ఆహారం నుంచి వచ్చే గ్లూకోస్ (చక్కెర) శరీరానికి శక్తినిస్తుంది. 8-12 గంటల తర్వాత, కాలేయంలోని గ్లూకోస్ నిల్వలు తగ్గుతాయి. శరీరం గ్లైకోజన్ (నిల్వ చేసిన గ్లూకోస్) ని కాల్చడం మొదలెడుతుంది. ఆకలి, అలసట, చిరాకు వస్తాయి. కొందరికి తలనొప్పి, మైండ్ కొంచెం మందగించినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మెదడుకి గ్లూకోస్ బాగా అలవాటు. నీళ్లు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు కాస్త తగ్గుతాయి. ఎండ్ ఆఫ్ ది డే.. శరీరం కొత్త శక్తి వనరుల కోసం సిద్ధమవుతుంది.
కీటోసిస్
రెండో రోజు నాటికి గ్లైకోజన్ నిల్వలు దాదాపు అయిపోతాయి. శరీరం కొవ్వుని కాల్చడం మొదలెడుతుంది, దీన్ని కీటోసిస్ అంటారు. కాలేయం కొవ్వుని కీటోన్స్‌గా మారుస్తుంది, ఇవి మెదడు, శరీరానికి శక్తిగా పనిచేస్తాయి. ఆకలి తగ్గుతుంది, ఎందుకంటే కీటోన్స్ ఆకలిని అదుపు చేస్తాయి. కొందరికి దృష్టి స్పష్టంగా అనిపిస్తుంది, కానీ కొందరికి బలహీనత, మైకం వస్తుంది. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ తగ్గవచ్చు, కాబట్టి నీళ్లలో కొంచెం ఉప్పు కలుపుకోవడం మంచిది. శక్తి మార్పుల వల్ల నిద్ర కూడా కాస్త డిస్టర్బ్ అవొచ్చు.
డీప్ ఫాస్టింగ్ మోడ్
మూడో రోజుకి శరీరం పూర్తిగా కీటోసిస్‌లో ఉంటుంది. కొవ్వు, కీటోన్స్‌పై ఆధారపడుతుంది. చాలా మంది మైండ్ క్లారిటీ, ప్రశాంతత అనుభవిస్తారు, ఎందుకంటే మెదడు కీటోన్స్‌కి అలవాటవుతుంది. ఆకలి చాలా తక్కువగా ఉంటుంది. శరీరం ఆటోఫాజీ అనే ప్రక్రియ మొదలెడుతుంది, ఇందులో దెబ్బతిన్న సెల్స్‌ని క్లీన్ చేసి, రీసైకిల్ చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం వంటి ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. కానీ శారీరకంగా బలహీనంగా అనిపించవచ్చు, ముఖ్యంగా యాక్టివ్‌గా ఉండలేం. ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉంటే కండరాలు తిమ్మిరి, గుండె దడ వంటివి రావొచ్చు. ఉపవాసం ముగించేటప్పుడు సూప్, పండ్లు వంటి తేలికైన ఆహారంతో మొదలెట్టాలి, లేకపోతే కడుపు ఇబ్బంది అవుతుంది.
ప్రమాదాలు, జాగ్రత్తలు
మూడు రోజులు ఉపవాసం అందరికీ సేఫ్ కాదు. షుగర్, గుండె జబ్బులు, గర్భం ఉన్నవాళ్లు చేయకూడదు. డీహైడ్రేషన్, మూర్ఛ, పోషకాల లోపం వచ్చే ఛాన్స్ ఉంది. డాక్టర్‌ని సంప్రదించకుండా చేయొద్దు. శరీరం దానికి అనుగుణంగా లేకపోతే, బాగా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఉపవాసాన్ని నిలిపివేయడం మంచిది.