Japanese Slim Secret: జపాన్ చాలా అందమైన దేశం. పచ్చని పర్వతాలు, విభిన్నమైన సంస్కృతి, రుచికరమైన ఆహారంతో పాటు మరెన్నో ప్రత్యేకతలను జపాన్ కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే.. జపాన్ ప్రజలు చాలా యవ్వనంగా , నాజుగ్గా ఉంటారని మనలో చాలా మందికి తెలుసు. ముఖ్యంగా ఆడవారు 50 ఏళ్ల వయస్సు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నట్లే కనిపిస్తారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? వారి లైఫ్ స్టైల్ ఇందుకు కారణమా లేక జన్యువులా ? అనే విషయాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ తాగడం:
జపనీస్ గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు. జపాన్‌లో ఎవరి ఇంటికి అయినా వెళితే.. తప్పకుండా గ్రీన్ టీ ఇస్తారు. ఈ గ్రీన్ టీని చాలా నాణ్యమైన టీ ఆకులను ఎండబెట్టి వాటి పొడితో తయారు చేస్తారు. ఈ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ బరువును తగ్గించడంలో అలాగే వృద్ధాప్యాన్ని తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.
పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం:
కొన్ని రకాల ఆహార పదార్థాలు పులియబెట్టడం ద్వారా లాక్టోబాసిల్లి అనే సమ్మేళనాలు ఏర్పడతాయి. కడుపు, చర్మం మొదలైన వాటికి సంబంధించిన వ్యాధులను నివారించడానికి ఈ రకమైన ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలి. కిణ్వ ప్రక్రియ ఆహారంలోని సహజ పోషకాలను సంరక్షిస్తుంది. అంతే కాకుండా ఎంజైమ్‌లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు.. ఈ ఆహారాలు బరువును కూడా తగ్గిస్తాయి.
సీ ఫుడ్ :
జపనీస్ రెడ్ మీట్ కంటే సీఫుడ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. రెడ్ మీట్ వాడకం వల్ల ఊబకాయం, వాపు, కొలెస్ట్రాల్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు క్రమంగా మొదలవుతాయి. సీఫుడ్, ముఖ్యంగా చేపలు తీసుకోవడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది. ముఖం యొక్క మెరుపును పెంచుతుంది.
Also Read: ఈ ఫేస్ ప్యాక్స్ వాడితే.. క్షణాల్లోనే మెరిసే చర్మం మీ సొంతం
తక్కువ పరిమాణంలో తినడం:
జపనీస్ ఆహార సంస్కృతిలో ముఖ్యమైనది తక్కువ తినడం. వీరు వంట చేసుకోవడానికి వాడే గిన్నెలు, ఫ్లేట్‌లు చిన్నవిగా ఉంటాయి. ఇలాంటివి వాడటం వల్ల కొంచెం ఆహారం కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇదిలా ఉంటే వారు చెంచాలకు బదులుగా ఆహారం తినడానికి చాప్‌స్టిక్‌లను కూడా ఉపయోగిస్తారు. వీటితో ఆహారం తీసుకుని నెమ్మదిగా నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.
వాకింగ్:
వాకింగ్ అనేది వ్యాయామంలో అత్యంత ప్రాథమిక దశ. మనం ఎక్కువ బరువు పెరిగినప్పుడు మాత్రమే వాకింగ్ చేస్తుంటాము. కానీ జపనీయులు నడవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దీని కారణంగా వారి బరువు అస్సలు పెరగదు. వాకింగ్ తో పాటు, ఇక్కడి ప్రజలు సైక్లింగ్‌ను కూడా ఇష్టపడతారు. ఇది మరొక మంచి వ్యాయామం. ఫలితంగా వారి శరీరం సన్నగా, నాజుగ్గా ఉంటుంది.