Homemade Face Pack: వర్షాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చల్లని గాలుల కారణంగా.. కొన్ని సార్లు చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలో చర్మ సమస్యల నుంచి బయటపడటానికి చాలా మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇవి చాలా ఖరీదైనవి, అంతే కాకుండా వీటిలోని రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ తయారు చేసుకుని వాడటం మంచిది. ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంతకీ ఎలాంటి హోం రెమెడీస్ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అరటిపండు , తేనె ఫేస్ ప్యాక్:
అరటిపండు, తేనెలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముఖానికి అరటి పండుతో పాటు తేనె మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల సహజమైన మెరుపును పొందవచ్చు. వీటితో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో పండిన అరటిపండును మెత్తగా చేసి.. ఇప్పుడు దానికి ఒక చెంచా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. తరువాత ముఖానికి అప్లై చేయండి. సుమారు 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
2. బొప్పాయి ఫేస్ ప్యాక్:
బొప్పాయిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఫేస్ ప్యాక్ తయారు చేయడం కోసం.. బొప్పాయిని ముక్కలుగా కోసి.. దానిని పేస్ట్ లాగా చేయండి. తర్వాత కాస్త నిమ్మరసం, తేనె కలపండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి.. 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ని క్రమం తప్పకుండా వాడటం వల్ల ముఖం యొక్క మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.
3. టమాటో ఫేస్ ప్యాక్:
టమాటో మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం కోసం.. ఒక గిన్నెలో 2-3 టీస్పూన్ల టమాటో జ్యూస్.. తీసుకొని, దానికి 1 టీస్పూన్ తేనె కలపండి. తర్వాత దానిని ముఖానికి అప్లై చేయండి. సుమారు 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. తరచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: ఎండు ద్రాక్ష నీరు ఇలా వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు !
4. గంధపు చెక్క, శనగపిండితో ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. ఒక గిన్నెలో ఒక చెంచా శనగపిండి, ఒక చెంచా గంధపు పొడి తీసుకోండి. దానికి చిటికెడు పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు దానికి కాస్త పాలు కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి.. 10-15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయండి. దీన్ని ఉపయోగించడం వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది. అంతే కాకుండా తెల్లగా మెరిసిపోతుంది.