ఇంట్లో వేడుకల సమయంలో, పుట్టినరోజులు, పండగల సమయంలో తీపి పదార్థాలు వండాల్సిందే. ఎక్కువ సమయం పాటు వండే స్వీట్లు కన్నా కేవలం పావుగంటలో రెడీ అయిపోయే స్వీట్లను ఎంపిక చేసుకుంటేనే మంచిది. వండుకుంటూ కూర్చొంటే వేడుకను ఎంజాయ్ చేయలేరు. ఇక్కడ మేము జ్యూసీగా ఉండే తీయటి బూందీ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడానికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒక్క పావుగంట సమయం కేటాయిస్తే చాలు. దీన్ని పండుగల సమయంలో నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జ్యూసీగా ఉండే బూందీని సింపుల్ గా ఎలా చేసేయాలో తెలుసుకోండి.
తీపి బూంది రెసిపీకి కావలసిన పదార్థాలు
శెనగపిండి -ఒక కప్పు
కుంకుమపువ్వు రేకులు – 4
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె -డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పంచదార – రెండు కప్పులు
యాలకుల పొడి – ఒక స్పూను
నీరు – మూడు కప్పులు
తీపి బూంది రెసిపీ
1. శెనగపిండిని జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలి. అది ఉండలు లేకుండా చూసుకోవాలి.
2. ఇప్పుడు ఒక కప్పు శెనగపిండిని ఒక గిన్నెలో వేయాలి. ముప్పావు కప్పు నీటిని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
3. అందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేయాలి. ఇలా నెయ్యిని కలపడం వల్లే బూందీ గుల్ల గుల్లగా వస్తుంది.
4. ఒక పావు గంట పాటు దాన్ని మ్యారినేట్ చేసి అలా వదిలేయండి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనెను వేయండి. బూందీని డీప్ ఫ్రై చేయడానికి ఎంత సరిపోతుందో అంత నూనె వేసుకోవాలి.
6. నూనె వేడెక్కాక పక్కన పెట్టుకున్న శెనగపిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలపండి.
7. ఇప్పుడు జల్లెడలో ఈ శెనగపిండి మిశ్రమాన్ని వేసి అది ముత్యాల్లాగా నూనెలో పడేటట్టు చూసుకోండి.
8. నూనెలో పడిన శెనగపిండి ముత్యాలు రంగులు మారేవరకు వేయించండి. అవి పసుపు రంగులోకి బాగా మారాక తీసి పక్కన పెట్టుకోండి.
9. ఇప్పుడు పంచదార సిరప్ ని తయారు చేయడానికి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టండి.
10. అందులో నీళ్లు, పంచదార వేసి కుంకుమ పువ్వు రేకులు కలపండి.
11. అది పాకంలాగా వచ్చాక ఈ బూందీ పై ఆ పంచదార పాకాన్ని వేసి కలుపుకోండి. అంతే టేస్టీ తీయటి బూందీ రెడీ అయినట్టే.
దీన్ని మీరు కాస్త చల్లబడ్డాక తింటే రుచి అదిరిపోతుంది. పిల్లలకు పెట్టేటప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కూడా కలిపి పెట్టండి. రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొందరు ఈ బూందీలో రంగులు కలిపి ఆకుపచ్చ, ఆరంజ్ వంటి బూందీ గుళ్లను కూడా చేరుస్తారు. అలా ఆర్టిఫిషియల్ రంగులు కలపకపోవడమే మంచిది. దీన్ని అలాగే నేరుగా తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ బూందీని ఒకసారి ఇంట్లోనే మీరు చేసుకుని చూడండి. ఇది వండడానికి పెద్దగా సమయం పట్టదు. ఒక పది నిమిషాలు శెనగపిండి నీటి మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. మరొక పది నిమిషాలు వాటిని వేయించాలి. రెండు బర్నర్ల స్టవ్ మీద పంచదార పాకం ఒకపక్క, మరోపక్క నూనె పెట్టుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం టేస్టీ జ్యూసీ తీపి బూందీని ఇంట్లో చేసేందుకు సిద్ధమైపోండి.