Milk Cream For Glowing Skin: ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనేక చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం.. కాలుష్యం, పోషకాహారలోపం, ఒత్తిడి ఇతర సమస్యలు కారణం కావచ్చు. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఫలితం రాకపోగా చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. పైగా చలికాలం.. ఈ సీజన్‌లో చర్మం పొడిబారిపోయి స్కిన్ డ్రై అవుతుంటుంది. కాబట్టి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా, అందంగా కనిపించాలంటే మన ఇంట్లోనే దొరికే పదార్ధాలతో ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయొచ్చు. ఇందుకోసం పాల మీగడ అద్బుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు.. ముఖం కాంతివంతంగా, అందంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. మిల్క్ క్రీమ్‌తో ఫేస్ ప్యాక్‌లు ఎలా ట్రై చేయాలో తెలుసుకుందాం..
మిల్క్ క్రీమ్, పసుపు ఫేస్ ప్యాక్..
పాల మీగడలో చిటెకెడు పసుపు వేసి ముఖానికి పట్టించండి. ఐదు, పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ఫేస్‌ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మంపై మచ్చలు, మొటిమలు, ట్యానింగ్ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాదు చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇలా ప్రతిరోజు ముఖానికి అప్లై చేయొచ్చు.
మిల్క్ క్రీమ్, తేనె ఫేస్ ప్యాక్..
పాలమీగడలో రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత ఫేస్‌ని సాధారణ నీటితో క్లీన్ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. తేనెలో మాయిశ్చరైజర్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు.. ముఖం మెరిసేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ప్రతిరోజు అప్లై చేయొచ్చు.
Also Read: పడుకునే ముందు వేడి నీరు త్రాగడం వల్ల కలిగే.. ఆశ్చర్యకర ప్రయోజనాలు
మిల్క్ క్రీమ్, శనగపిండి ఫేస్ ప్యాక్
మిల్క్ క్రీమ్‌లో రెండు టేబుల్ స్పూన్ శనగపిండి కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. అరగంట తర్వాత నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోండి. ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్లే ముందు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ముఖం చాలా గ్లోయింగ్‌గా కనిపిస్తుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.
మిల్క్ క్రీమ్, ముల్తానీ మిట్టి..
ఒక టీస్పూన్ మిల్క్ క్రీమ్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు మూడు సార్లు చేయొచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.