NATS Service:తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దివ్యాంగులు, అనాథలు, వెన్నెముక గాయాలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా నాట్స్ ప్రతినిధులు నిడదవోలులో పర్యటించారు.
నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ, న్యూజెర్సీ చాప్టర్ కో-ఆర్డినేటర్ సాయి గంగుల సెప్టెంబర్ 20న నిడదవోలులోని హృదయాలయం ప్రత్యేక పాఠశాల, పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.ఎన్‌ఆర్‌ఐల సహకారంతో హోప్4స్పందన ఈ భవనాన్ని నిర్మించింది. ఆగస్టు 27, 2026న భవనం ప్రారంభమైంది. భవన నిర్మాణం కోసం నాట్స్ 10 వేల అమెరికన్ డాలర్ల సాయం అందించింది.
చిన్నారులతో కలిసి నాట్స్ ప్రతినిధులు
హృదయాలయం కేంద్రంలో ఉన్న చిన్నారులతో నాట్స్ ప్రతినిధులు కొంతసేపు గడిపారు. వారికి అందుతున్న పునరావాసం, బ్రిడ్జి కోర్సు, ఫిజియోథెరపీ సేవల గురించి తెలుసుకున్నారు. చిన్నారులకు స్వీట్లు అందించారు.మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులకు కూడా ఇలాంటి సేవలు అందేలా కార్యక్రమాలను విస్తరించాలని నాట్స్ ప్రతినిధులు తెలిపారు.
దివ్యాంగులకు కిరాణా షాపులు
దివ్యాంగులు సొంతంగా సంపాదించుకునేలా నాట్స్ ఆర్థిక సాయం చేస్తోంది. ఇందులో భాగంగా తొర్రేడు గ్రామంలో గోపి, వెంకటానగర్‌లో దేవదాసు చినబాబులకు కేటాయించిన కిరాణా షాపులకు నాట్స్ సాయం అందించింది.ఒక్కో షాపుకు రూ.1.30 లక్షల చొప్పునఆర్థిక సహాయం చేశారు. ఈ రెండు షాపులను కిషోర్ కంచర్ల, రాజ్ అల్లాడ, సాయి గంగుల ప్రారంభించారు.
వెన్నెముక బాధితులకు మెడికల్ కిట్లు
వెన్నెముకకు గాయాలై మంచానికే పరిమితమైన, వీల్‌చైర్‌పై ఆధారపడుతున్న వారికి హోప్4స్పందన నెలనెలా మెడికల్ కిట్లు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా సహకరిస్తోంది.హైదరాబాద్‌లో రాజ్ అల్లాడ ఈ కిట్లను పరిశీలించారు. యూరినల్ బ్యాగులు, డైపర్లు, క్యాథిటర్లు, కాటన్ రోల్స్, బెటాడిన్, డెటాల్, గ్లౌజులు తదితర 13 రకాల వస్తువులను కిట్లలో అందిస్తున్నారు.
అనాథాశ్రమాలకు కూడా సాయం
అనాథలకు శాశ్వత ఆశ్రయం కల్పించే కార్యక్రమాలకు కూడా నాట్స్ సహాయం చేస్తోంది. అనంతపురంలోని ఆశ్రయ అనాథ ఆశ్రమం, హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంకు నాట్స్ అండగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమాలను హోప్4స్పందన ఆంధ్ర–తెలంగాణ సమన్వయకర్త డాక్టర్ రఘు ఆరికపూడిసమన్వయం చేస్తున్నారు. నిడదవోలు, రాజమండ్రిలో జరిగిన కార్యక్రమాల్లో హృదయాలయం వ్యవస్థాపకులు డా. గణేష్ బాబు, ఆర్గనైజర్ డాక్టర్ బలగం విశాలక్ష్మి, దయ్యాల మహేష్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రవాస భారతీయులకు నాట్స్ నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని నాట్స్ ప్రతినిధులు తెలిపారు.