ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వారితో ఒకరోజు గడిపితే చాలు. వారి మధ్య ఉన్న అన్యోన్యత అర్థం అయిపోతుంది. చాలామంది భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితులు మారిపోతాయి. ఒకరిపై ఒకరికి విరక్తి కలుగుతుంది. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇలా ఆధునిక కాలంలో ఎన్నో కేసులను చూస్తున్నాం. అంతవరకు అన్యోన్యంగా ప్రేమగా ఉన్న జంట ఎందుకు విడిపోయిందో తెలియక ఎంతో మంది తలలు పట్టుకుంటారు. నిజానికి భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యత ఉన్నా కూడా కొన్ని విషయాలను రహస్యంగానే ఉంచాలి. వాటిని కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటే భార్యాభర్తల బంధం బీటలు పడడం మొదలైపోతుంది.
నమ్మి మన చెయ్యి పట్టుకున్నా జీవిత భాగస్వామి దగ్గర ఏదీ దాచకూడదని అంటారు. అది నిజమే కానీ ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని నిజాలను కచ్చితంగా దాయాలి. పెళ్లికి ముందు జరిగే కొన్ని సంఘటనలు పెళ్లి తర్వాత జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించకుండా ఉండాలంటే వాటిని దాచి ఉంచడమే మంచిది. కానీ జీవిత భాగస్వాములు మధ్య అన్యోన్యత, ప్రేమ పెరిగాక కొంతమంది నమ్మకంతో తమ పూర్వ విషయాలను చెప్పేస్తారు. ఇప్పుడు ఎంత మంచిగా, నిజాయితీగా ఉంటున్నా కూడా ఎదుటివారికి మాత్రం నమ్మకం సన్నగిల్లి పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మేము చెప్పిన ఏ విషయం కూడా జీవిత భాగస్వామితో మాట్లాడకండి.
మాజీల గురించి
ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్లో లేదా కాలేజీల్లో ఉద్యోగం చేసే చోట ఎవరో ఒకరు నచ్చుతారు. వారిని తమ క్రష్ అని చెప్పుకుంటారు. ఎంతోమంది ఫస్ట్ క్రష్ అంటూ తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. అలా భార్యాభర్తలు కూడా చేయొచ్చు. తమ అందమైన జ్ఞాపకాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలని అనుకుంటారు. అలా అనుకునే ఎంతోమంది తమ క్రష్ గురించి చెప్పేస్తారు. ఆ సమయంలో ఎలాంటి గొడవ లేకపోయినా తరువాత ఎప్పుడో ఒకసారి ఇద్దరి మధ్య చిన్నపాటి వాదన తలెత్తవచ్చు. ఆ వాదనలో మీ క్రష్ గురించి మాట్లాడగానే విపరీతమైన కోపంతో గొడవ తారాస్థాయికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి భార్యాభర్తల మధ్యలోకి మీ పాత ప్రేమికుల సంగతి తీసుకురాకండి.
లైంగిక ఊహలు
మగవారికి లైంగిక కోరికలు ఆడవారితో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. వారు కలలో, ఊహల్లో కూడా లైంగిక చర్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటివి భార్యతో పంచుకునేవారు కొంతమంది ఉంటారు. నిజానికి అలాంటి ఊహలు, కలలను కొంతమంది ఆడవారు ఇష్టపడరు. లేనిపోని అనుమానాలను పెంచుకుంటారు. కేవలం లైంగిక సంబంధం కోసమే పెళ్లి చేసుకున్నారని భావిస్తారు. అది ఇద్దరి మధ్య ప్రేమను తగ్గించేస్తుంది.
సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లయ్యాక ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అలాగే వాటి పాస్‌వర్డులు వంటివి భార్యాభర్తలు షేర్ చేసుకోకండి. ఫేస్‌బుక్ వంటివి పెళ్ళికి ముందు నుంచే వాడేవారు ఉంటారు. పాత మెసేజులను, పరిచయాలను చూసి మీ జీవిత భాగస్వామికి మీపై అనుమానం రావచ్చు. అనుమానం విరక్తిగా మారవచ్చు. గతంలో మీరు మాజీలతో ఉన్న ఫోటోలు లేదా మెసేజ్ లు చదివి… వారు ఇబ్బంది పడవచ్చు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను తెస్తుంది. కాబట్టి వీలైనంతవరకు సోషల్ మీడియా ఎకౌంట్స్ రహస్యంగానే ఉంచడం జీవితానికి మంచిది.
పెళ్లయ్యాక మీ బంధాన్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి. తేలికగా వ్యవహరించడం ప్రతి విషయాన్ని తక్కువగా చూడడం వంటివి చేస్తే చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారిపోయే అవకాశం ఉంది.
Also Read: సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ ఏడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి