గత రాత్రి మద్యపానం అధికంగా చేస్తే మరుసటి రోజు ఏ పనీ చేయలేరు. హ్యాంగోవర్ లో ఉన్నట్టే ఉంటుంది. దేనిమీద శ్రద్ధ పెట్టలేరు. అలాగే ముందు రోజు రాత్రి స్వీట్లు అధికంగా తిన్నా కూడా మీకు స్వీట్ హ్యాంగోవర్ వస్తుంది. అప్పుడు మీ శరీరం పనిచేసేందుకు సిద్ధంగా ఉండదు. దేని మీద దృష్టి కేంద్రీకరించలేరు. అలాంటప్పుడు స్వీట్ హ్యాంగవర్ నుంచి కూడా తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం చాలామంది వ్యక్తులు ప్రతిరోజూ కావాల్సిన దాని కన్నా మూడు రెట్లు అధికంగా స్వీట్‌గా ఉండే పదార్థాలను తింటున్నారు. ఇలా ఎక్కువ తీపి ఉండే పదార్థాలను తినడం చాలా హానికరం.
స్వీట్లు అధికంగా తినడం వల్ల శరీరం ఎంతో కష్టపడుతుంది. ఉదాహరణకు మీరు ఒక పెద్ద కేక్ ముక్క తిన్నారనుకోండి అప్పుడు అందులో ఉండే చక్కెరంతా రక్తంలో చేరుతుంది. ఇది రక్త ప్రవాహంలో తెలియాడే అదనపు చక్కెరగా మారుతుంది. దాన్ని బయటికి పంపించడానికి శరీరం ఇన్సులిన్ ని అధికంగా పంపు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువకి పడిపోతాయి. దీంతో మీలో శక్తి అకస్మాత్తుగా తగ్గిపోయినట్టు నీరసంగా మారిపోతారు.
మీరు ముందు రోజు రాత్రి అధికంగా చక్కెర ఉన్న పదార్థాలు తిని ఉంటే మరుసటి రోజు కొన్ని పనులు చేయండి. దీనివల్ల స్వీట్ హ్యాంగోవర్ తగ్గుతుంది.
మీరు ముందు రోజు రాత్రి తీపి పదార్థాలు అధికంగా తింటే మరుసటి రోజు నీరు అధికంగా తాగండి. నీరు ఎంత ఎక్కువగా తాగితే అంతగా మీ హ్యాంగోవర్ నుంచి బయటకు వస్తారు. అలాగే పుచ్చకాయలు, దోసకాయలు, స్ట్రాబెర్రీలు, పెరుగు వంటివి అధికంగా తినడం వల్ల శరీరంలో నీటి సమతుల్యత సాధారణంగా మారిపోతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం వంటివి తినడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. స్వీట్ పదార్థాలు అధికంగా తింటే శరీరం డీహైడ్రేటెడ్ అయ్యే అవకాశం ఉంది.
వ్యాయామం చేయడం
స్వీట్ పదార్థాలు తిన్నాక వీలైనంత వరకు తేలికపాటి వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. వాకింగ్ వంటివి చేసినా చాలు రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా నెమ్మదిగా పెరగడం మొదలవుతాయి. దీనివల్ల శరీరానికి ఎలాంటి హాని కలగదు. అలాగే ఇన్సులిన్ ఒకేసారి పెరగదు. కాబట్టి సమస్యలు రావు.
స్వీట్ పదార్థాలు తిన్న తర్వాత ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేయండి. అలాగే మద్యం, ధూమపానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఈ రెండింటి వల్ల హ్యాంగోవర్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.