తెలుగిళ్లల్లో ఎన్న రకాల టేస్టీ పాయసాలు చేస్తూనే ఉంటారు. పండగ వచ్చిందంటే కచ్చితంగా పాయసం నైవేద్యంగా పెట్టాల్సిందే. ఎప్పుడూ ఒకేలాంటి పాయసం పెడితే ఎలా? ఒకసారి కొత్తగా పనసపండు పాయసం చేసి చూడండి. ఇది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పనసపండు తొనలతో ఈ పాయసాన్ని తయారు చేస్తారు. ఇందులో మనము పంచదారకు బదులు బెల్లం వాడుతున్నాం. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకెందుకు ఆలస్యం పనసపండు పాయసం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
పనస పండు తొనలు – 30
ఉప్పు- చిటికెడు
శొంఠి పొడి – చిటికెడు
నెయ్యి – రెండు స్పూన్లు
జీడిపప్పు – 10
కొబ్బరి తురుము – రెండు స్పూన్లు
కొబ్బరి పాలు – రెండు కప్పులు
బెల్లం తురుము – మూడు స్పూన్లు
పనసపండు పాయసం రెసిపీ
1. పనస తొనలు తీపిగా ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా మనం ఎక్కువ మొత్తంలో పంచదార, బెల్లం వేయాల్సిన అవసరం లేదు.
2. అందుకే బెల్లం తురుమును కొంచమే తీసుకోవాలి.
3. ముందుగా పనస పండు తొనలను చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో వేయాలి.
4. అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా గరిటతోనే నలిపి పేస్టులా చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి మళ్లీ బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి.
6. చిన్న మంట మీద దీన్ని మరిగించాలి. తురిమిన బెల్లాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి.
7. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా అందులో వేసి బాగా కలపాలి. ఒక కప్పు నీటిని కూడా వేయాలి.
8. ఈ మొత్తం బాగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు శొంఠి పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇది మరుగుతూ ఉన్నప్పుడు పక్కన మరొక బర్నర్ పై చిన్న గిన్నె పెట్టి నెయ్యి వెయ్యాలి.
10. అందులో జీడిపప్పులు, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.11. వాటిని కూడా పనసపండు పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి.
12. ఇది కాస్త చిక్కగా వచ్చేవరకు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
13. అంతే పనసపండు పాయసం సిద్ధమైనట్టే. దీన్ని అలా కాసేపు వదిలేస్తే చల్లబడి చిక్కగా అవుతుంది.
వేసవిలో పనసపండు పాయసాన్ని చల్లగా తింటేనే టేస్టీగా ఉంటుంది. కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి తినేందుకు ప్రయత్నించండి. ఇందులో పంచదార వెయ్యలేదు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే.
పనస పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఈ పనసపండుతో చేసిన పాయసాన్ని డయాబెటిస్ రోగులు ఎక్కువ తినడం ఆరోగ్యకరం కాదు. వీలైనంత వరకు చాలా తక్కువ తినాలి. మిగతావారు మాత్రం సంతోషంగా ఎంతైనా తినవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పనస పండులోని పోషకాలు, బెల్లంలోని పోషకాలు, కొబ్బరి పాలులోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ పనస పండు పాయసాన్ని ఒకసారి చేసుకుని చూడండి. ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఇలా పాయసం చేసి పెడితే వారందరికీ తెగ నచ్చుతుంది. మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం. అలాగే పెళ్లిరోజులు, పుట్టినరోజులు కూడా ఈ పనసపండు పాయసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని చేయడానికి 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు.