మహాశివరాత్రికి తాము ఉపవాసం ఉండి ఆ మహా శివునికి తీపి పదార్థాలను నివేదిస్తారు భక్తులు. శివుడికి ఇష్టమైన ప్రసాదాలను నివేదించడం ద్వారా మీరు అతని ఆశీస్సులను పొందవచ్చు. శివునికి అందించే ప్రసాదాలలో కచ్చితంగా ఉండాల్సినవి పంజిరి. అలాగే బేసిన్ లడ్డు కూడా శివునికి ఎంతో ఇష్టమైనది. తీపి పదార్థాలనే మహాశివరాత్రి రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ మేము బేసన్ లడ్డు రెసిపీ, పంజిరీ రెసిపీ ఇచ్చాము.
బేసన్ లడ్డుకి కావలసిన పదార్థాలు
శనగపిండి – రెండు కప్పులు
నెయ్యి – అర కప్పు
పంచదార – ముప్పావు కప్పు
యాలకులు పొడి – పావు స్పూను
బాదం తరుగు – రెండు స్పూన్లు
పిస్తా తరుగు – రెండు స్పూన్లు
బేసన్ లడ్డూ రెసిపీ
❂ బేసన్ లడ్డు చేయడానికి పంచదారను ముందుగానే మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
❂ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో శెనగపిండిని వేసి చిన్న మంట మీద వేయించాలి.
❂ పిండి బాగా నెయ్యిలో కలిసి పేస్టులాగా అవుతుంది. దాని రంగు కాస్త ముదురుగా మారుతుంది.
❂ అప్పుడు అందులో పంచదార పొడిని వేసి బాగా కలపాలి.
❂ అలాగే యాలకుల పొడి కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమం బాగా కలిసి దగ్గరగా హల్వా లాగా అయ్యే వరకు గరిటతో కలుపుతూనే ఉండాలి.
❂ చిన్న మంట మీద చేస్తే అడుగు అంటకుండా వస్తుంది.
❂ ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా గట్టిగా మందంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
❂ అది గోరువెచ్చగా అయ్యేవరకు వేచి ఉండాలి.
❂ తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఆ మిశ్రమంలో పిస్తా తరుగు, బాదం తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
❂ వాటిని చేత్తో తీసుకొని గుండ్రంగా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే బేసన్ లడ్డు రెడీ అయినట్టే.
❂ దీన్ని చేయడానికి అరగంట సమయమే పడుతుంది. కాబట్టి మహాశివరాత్రి రోజే వీటిని తయారు చేసి శివునికి నివేదించవచ్చు.
…………………………………………………………………………………………………….
Also Read: మహా శివరాత్రి నాడు ఈ పనులు అస్సలు చేయకండి, కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే!
పంజిరీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ధనియాలు – అరకప్పు
నెయ్యి – నాలుగు స్పూన్లు
తులసి ఆకులు – గుప్పెడు
యాలకుల పొడి – అర స్పూను
పంచదార పొడి – అరకప్పు
కొబ్బరి తురుము – మూడు స్పూన్లు
కిస్‌మిస్లు – గుప్పెడు
పుచ్చకాయ గింజలు – గుప్పెడు
జీడిపప్పులు – గుప్పెడు
చిరోంజీ గింజలు – రెండు స్పూన్లు
బాదం పప్పులు – గుప్పెడు
పూల్ మఖానా – అర కప్పు
నెయ్యి – నాలుగు స్పూన్లు
పంజిరి రెసిపీ
❂ మిక్సీ జార్లో ధనియాలను వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
❂ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యిని వేయాలి.
❂ అందులో ధనియాల పొడిని వేసి వేయించాలి. ధనియాల పొడి మంచి వాసన వచ్చేదాకా చిన్న మంట మీద వేయించుకోవాలి.
❂ ఈ ధనియాల పొడిని ఒక ప్లేట్ లో వేసుకోవాలి.
❂ ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నెయ్యి వేసి ఫూల్ మఖానాను వేయించి అవి కరకరలాడే సమయంలో తీసి పక్కన పెట్టుకోవాలి.
❂ ఇప్పుడు అదే కళాయిలో మరో రెండు స్పూన్ల నెయ్యిని వేసి బాదం పప్పులు, చిరోంజీ గింజలు, జీడిపప్పులు, పుచ్చకాయ గింజలు, కిస్మిస్లు వేసి వేయించుకోవాలి.
❂ అలాగే చివరిలో ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి.
❂ ధనియాల పొడి వేసుకున్న ప్లేటులోనే పూల్ మఖానాను కూడా వేయాలి.
❂ అలాగే వేయించుకున్న బాదం పప్పులు, చిరోంజీ గింజలు, జీడిపప్పులు, పుచ్చకాయ గింజలు, కిస్మిస్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
❂ ఎండు కొబ్బరి తురుమును కూడా వేయాలి.
❂ ఇప్పుడు ఇందులోనే పంచదార పొడిని, యాలకుల పొడిని, తులసి ఆకులను వేసి బాగా కలపాలి.
❂ అంతే ధనియా పంజిరి రెడీ అయినట్టే. ఇది దేవతలకు ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు.
పంజిరి అందరి దేవతలకు నైవేద్యంగా సమర్పించవచ్చు. జన్మాష్టమికి శ్రీకృష్ణుడికి కూడా ఈ పంజిరిని సమర్పిస్తారు. అలాగే మహా శివునికి కూడా ఈ పంజిరి రెసిపీ అంటే ఎంతో ఇష్టం. ఈ రెండింటినీ మీరు తక్కువ సమయంలోనే వండవచ్చు. కాబట్టి వీటిని నైవేద్యంగా పెట్టేందుకు ప్రయత్నించండి.