Papaya Hair Mask: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా , బలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, ఆహారం, హార్మోన్ల అసమతుల్యత వల్ల, జుట్టు నిస్తేజంగా, బలహీనంగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభం అవుతుంది. చాలా సార్లు జుట్టు పెరుగుదల లేకపోవడం వల్ల బట్టతల సమస్య కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో విత్తనాలతో కూడిన బొప్పాయి జుట్టును తాడులాగా మందంగా, బలంగా మార్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును, బొప్పాయి జీర్ణవ్యవస్థకు మాత్రమే కాకుండా జుట్టు పొడవును పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బొప్పాయిలో విటమిన్ ఎ , సి, ఫోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ , అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వల్ల తలపై చర్మాన్ని బలోపేతం చేయడానికి, జుట్టు అందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జుతో పాటు, దాని గింజలు కూడా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు:
జుట్టు పెరుగుదలకు:
బొప్పాయి బట్టతలని నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ , యాంటీ ఆక్సిడెంట్లు రక్త ఆక్సిజన్ , పోషకాలను పెంచడం ద్వారా జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తాయి.
చుండ్రు:
చుండ్రు అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బొప్పాయి చుండ్రు, దురద , పొడిబారడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చుండ్రు రాకుండా కాపాడుతుంది.
మీ జుట్టును కండిషన్ చేస్తుంది:
బొప్పాయి సారం జుట్టుకు పోషణను అందించే పపైన్, కైమోపాపైన్, విటమిన్ సి వంటి యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి జుట్టుకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.
జుట్టు రాలడం :
బొప్పాయి మీ జుట్టులో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా మీ జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా జుట్టుకు మేలు జరుగుతుంది.
మెరుపును పెంచుతుంది:
షాంపూ, కాలుష్యం కారణంగా జుట్టు దాని సహజ మెరుపును కోల్పోతుంది. బొప్పాయిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా జుట్టు మెరుపును కాపాడుకోవచ్చు.
జుట్టు పెరుగుదలకు బొప్పాయిని ఎలా ఉపయోగించాలి ?
1. బొప్పాయి, నిమ్మకాయ మాస్క్:
కావాల్సినవి:
1 కప్పు- బొప్పాయి గుజ్జు
2 టీస్పూన్లు- నిమ్మరసం
తయారీ విధానం: జుట్టు పెరుగుదలకు బొప్పాయి గుజ్జు, నిమ్మరసం కలిపి మృదువైన పేస్ట్‌ను తయారు చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో జుట్టును వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
2. బొప్పాయి గింజల హెయిర్ మాస్క్:
కావాల్సనవి:
బొప్పాయి గింజలు-2 టీస్పూన్లు
కొబ్బరి నూనె-, 2 టీస్పూన్లు
తేనె-1 టీస్పూన్
తయారీ విధానం: బొప్పాయి గింజల హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, బొప్పాయి గింజలు , కొబ్బరి నూనెను మిక్సర్ జార్‌లో కలిపి పేస్ట్ లా చేయండి. తర్వాత దానికి తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ని తలకు బాగా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తలస్నానం చేసి జుట్టును కడిగి ఆరబెట్టండి.
Also Read: అరటి పండ్లు త్వరగా.. పాడవకుండా ఉండాలంటే ?
3. బొప్పాయి, పెరుగు హెయిర్ మాస్క్:
కావాల్సినవి:
బొప్పాయి గుజ్జు- 1 కప్పు
పెరుగు- 1 కప్పు
అరటిపండు- 1
తయారీ విధానం: బొప్పాయి, పెరుగు మాస్క్ తయారు చేయడానికి పైన తెలిపిన అన్ని పదార్థాలను మిక్సర్ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌ను తయారు చేయండి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టు తలకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరిపోయే వరకు అలాగే ఉంచండి. తర్వాత జుట్టును షాంపూతో వాష్ చేయండి.