చలికాలంలో బరువు పెరగడం చాలా సులువు. ఎందుకంటే చలికి భయపడి ఎంతో మంది వ్యాయామం మానేస్తారు. అలాగే ఒకే చోట ఎక్కువ సేపు కూర్చునేందుకు, పడుకునేందుకు ఇష్టపడతారు. చలి వల్ల దుప్పటి కప్పుకొని నిద్ర కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆహారం కూడా త్వరగా జీర్ణం కాదు. దీనివల్లే శీతాకాలంలో శరీరం బరువు త్వరగా పెరిగిపోతుంది. మీరు కొన్ని పనులు చేయడం ద్వారా చలికాలంలో మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఇలా తింటే బరువు పెరుగుతారు
ఏమి తిన్నా కూడా మీరు మితంగానే తీసుకోవాలి. అధికంగా తింటే అది కొవ్వు రూపంలో పెరిగిపోతుంది. చలికాలంలో మీరు పెద్దగా పనులు చేయరు. అలాగే జీర్ణవ్యవస్థ కూడా మందకొడిగా సాగుతుంది. అప్పుడు ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అది శక్తి రూపంలో వినియోగం జరగక కొవ్వరూపంలోకి మారిపోతుంది. కాబట్టి తక్కువ ఆహారాన్ని తినడం మంచిది. అలాగే క్యారెట్, ముల్లంగి వంటివి చలికాలంలో దొరికే కూరగాయలను తినడం చాలా ముఖ్యం. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ కాలం పాటు శక్తిని అందిస్తూ ఉంటుంది. ఇతర ఆహారాలను తినకుండా అడ్డుకుంటుంది. క్యారెట్లు ముల్లంగి తో ఆహారాన్ని వండుకొని తినేందుకు ప్రయత్నించండి.
జీవక్రియ చలికాలంలో మందకొడిగా ఉంటుంది. కాబట్టి జీవక్రియ రేటును మెరుగుపరిచే పానీయాలను తాగేందుకు ప్రయత్నించండి. దాల్చిన చెక్క, అల్లం, పసుపు, మిరియాలు వంటివి ఆహారంలో ఉండేలా చేసుకోండి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. క్యాలరీలను త్వరగా బర్న్ అయ్యేలా చేస్తాయి. దాల్చిన చెక్క మధుమేహ రోగులకు కూడా ఎంతో మంచిది. అలాగే అల్లం జీవక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగడం, అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం, పాలల్లో పసుపు కలుపుకొని తాగడం లేదా మిరియాలు కలుపుకొని తాగడం వంటివి చేయండి. ఎలా అయినా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు పెరిగే ప్రక్రియ నెమ్మదిస్తుంది.
నీటితో బరువు తగ్గడం
చలికాలంలో నీరు తాగే వారి సంఖ్య చాలా తక్కువ. వాతావరణం చల్లగా ఉండడంతో పెద్దగా దాహం వేయదు. అందుకే ఎంతోమంది నీరు తాగరు. దీనివల్ల మీకు తెలియకుండానే శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి దాహం వేసినా వేయకపోయినా గంటకు గ్లాసుడు నిలువు తాగేయండి. ఇలా తాగడం వల్ల చర్మం తేమవంతం అవుతుంది. ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. కాబట్టి కొవ్వు కూడా పేరుకుపోదు. అలాగే నిమ్మరసం, గ్రీన్ టీ వంటివి అధికంగా తాగుతూ ఉండండి. ఇవి క్యాలరీలను బర్న్ చేస్తాయి.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తింటే మంచిది. పెసరపప్పుతో చేసే వంటకాలు, పనీర్ వంటకాలు, లీన్ ప్రోటీన్ ఉండే చికెన్ వంటకాలు వంటివి తినేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మన శరీరానికి శక్తిని అందించడంతోపాటు ఎక్కువ సమయం వరకు పొట్ట నిండిన ఫీలింగ్ ను అందిస్తాయి.
Also Read: బెల్లీ ఫ్యాట్ తగ్గాలా ? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అవిసె గింజలు, బాదం పప్పులు, చియా గింజలు, జీడిపప్పులు వంటివి రోజుకో గుప్పెడు తినేందుకు ప్రయత్నించండి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి ఇతర ఆహారాలను తగ్గించేలా చేస్తాయి. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటాయి. బాదంపప్పులను నానబెట్టి తినేందుకు ప్రయత్నించండి. అలాగే పెరుగులో చియా గింజలు, అవిసగింజలు నానబెట్టుకుని తిన్నా ఎంతో మంచిది.
చలికాలంలో ఎర్రటి ఎండ ఎక్కడా ఉండదు. సూర్యుడు కాసేపు అలా మెరిసి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే సూర్యుడికి ఎదురుగా నిల్చుని సన్ బాత్ చేసేందుకు ప్రయత్నించండి. ఇది విటమిన్ డి పొందేందుకు అద్భుతమైన మార్గం.