Pesarattu Premix Powder: చాలా మందికి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు కూడా ఒకటి. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చట్నీతో వేడి వేడి పెసరట్టును కలిపి తింటే అబ్బో.. ఆ టేస్ట్‌కి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఇంత రుచిగా ఉండే పెసరట్టును తయారు చేయడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. పెసరట్టు చేయాలనుకుంటే ముందురోజు పెసర పప్పు, బియ్యం నానబెట్టి, తర్వాత రోజు మిక్సీ పట్టి దోసెలుగా వేయాలి. ఇందుకు చాలా సమయమే పడుతుంది. కానీ టైం ఎక్కువగా లేనప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెసరట్టు మిక్స్‌తో దోసెలు వేస్తే.. ఐడియా అదిరిపోయింది కదా.. ఇంకెందుకు ఆలస్యం పెసరట్టు ప్రిమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సినవి:
4 కప్పులు- పెసర్లు
అరకప్పు- బియ్యం
పెసర్లు, (పెసర గుండ్లు) బియ్యంలను పైన తెలిపిన మోతాదులో తీసుకుని శుభ్రంగా కడిగండి. నీటిని పూర్తిగా తొలగించి క్లాత్ పై వీటిని ఆరబెట్టండి. రాత్రి పూట వీటని ఆరబెడితే.. ఉదయానికి ఆరిపోతాయి. ఇలా ఆరిన ఫెసరు, బియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని పాన్ పై కాస్త వేయించండి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉన్న నీరు పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి.
మరో పాన్ తీసుకుని దాంట్లో చిన్నవి 4 అల్లం ముక్కలు, 3 పావు స్పూన్ల మిరియాలు, 4 ఎండు మిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. చివర్లో చిన్న కప్పు కరివేపాకు కూడా పాన్ లో వేసి వేయించి.. వీటన్నింటిని మిక్సీలో వేయండి. తర్వాత ఇందులోనే కాస్త ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టండి. తర్వాత పెసర్లు, బియ్యం అన్నింటినీ కలిపి పౌడర్ చేయండి. 3 నుంచి 4 సార్లు మిక్సీ పడితే మొత్తం పిండి సిద్దం అవుతుంది. దీనిని ఒక సారి మొత్తం స్పూన్ సహాయంతో మిక్స్ చేయండి.
ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ ని మీరు దోస తినాలని అనుకున్నప్పుడు అరగంట ముందు కాస్త నీటితో ఉండలు లేకుండా కలిపి నానబెట్టండి. తర్వాత పాన్ పై పెసరట్టు వేయండి. చాలా క్రిస్పీగా, రుచిగా ఈ పౌడర్ తో మీరు పెసరట్టు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీంట్లోకి టమాటో చట్నీ, లేదా పల్లీ చట్నీ రెండిట్లో ఏదైనా బాగుంటుంది. తక్కువ టైంలో రుచికరమైన టిఫిన్ తయారు చేయాలని అనుకున్నప్పుడు ఈ పెసరట్టు ట్రై చేయండి. ఒక సారి ఈ పౌడర్ తయారు చేస్తే.. 3 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే ట్రై చేయండి మరి.