Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోసారి ప్రకృతి బీభత్సం సృష్టించింది. తాజాగా చమోలీ జిల్లాలోని నందానగర్ ప్రాంతం భారీ వర్షాలకు గురైంది. ఆ ప్రాంతంలో సంభవించిన క్లౌడ్‌బరస్ట్ కారణంగా భారీ వరదలు వచ్చాయి. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తులో.. కనీసం పది మంది గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు. రెస్క్యూ బృందాలు ప్రస్తుతం నిరంతరం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
కుండపోత వర్షాలు, క్లౌడ్ బరస్ట్ ప్రభావం
ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలు ఎప్పుడూ.. మాన్సూన్ ముప్పుకు గురవుతుంటాయి. నందానగర్‌లో కుండపోత వర్షాలు కురిసిన తర్వాత.. ఒక్కసారిగా క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. కొద్ది నిమిషాల్లోనే వర్షపు నీరు గ్రామాలను ముంచెత్తింది. దాని ప్రభావంతో పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆరు పెద్ద భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇళ్లు, భవనాలు ధ్వంసం
వరదలు ఉధృతంగా రావడంతో నందానగర్ పరిసరాల్లో.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
రెస్క్యూ బృందాల చర్యలు
ప్రకృతి విపత్తు సమాచారం అందుకున్న వెంటనే.. ఎస్‌డిఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముంపులో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. కొట్టుకుపోతున్న ఇళ్లలో చిక్కుకున్న ఇద్దరిని సజీవంగా బయటకు తీశారు. అయితే మిగతావారి కోసం చర్యలు కొనసాగుతోంది. పది మంది ఇంకా కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు.
ప్రజల్లో భయాందోళన
ఈ విపత్తుతో గ్రామస్థులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అనేక కుటుంబాలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాయి. వర్షాలు ఆగకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశముందని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ప్రత్యేక శిబిరాలకు తరలించబడ్డారు.
గతంలోనూ ఇలాంటి పరిస్థితులు
ఉత్తరాఖండ్‌లో ఇటీవల క్లౌడ్‌బరస్ట్‌లు, ల్యాండ్‌స్లైడ్‌లు తరచుగా సంభవిస్తున్నాయి. కేదార్నాథ్ దుర్ఘటన, ఇటీవల జోషిమఠ్ ప్రాంతంలో భూస్రావం, వరదలు ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఈసారి కూడా చమోలీ జిల్లా ప్రకృతి విపత్తు కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది.
ప్రభుత్వ స్పందన
ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లా అధికారులను ఆదేశించారు. ఆహారం, వైద్య సదుపాయాలను శిబిరాల్లో ఏర్పాటు చేశారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపుతామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు షాక్.. వాయిదా పడ్డ ప్రక్రియ!
రెస్క్యూ బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా.. ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి సవాలుగా మారింది.