Dirty Dishes Problems: ప్రస్తుతం బిజీ లైఫ్, వివిధ రకాల పనులు, ఉద్యోగాల కారణంగా వంట చేసుకుని తినేందుకు కూడా చాలా మందికి టైం ఉండటం లేదు. అలాంటి వారు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది ఇంట్లోనే వంట చేసుకుని తిన్నా కూడా సమయం లేదని వంట పాత్రలను గంటల తరబడి శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. ఇలా తిన్న ప్లేట్లను భోజనం చేసిన తర్వాత గంటల తరబడి సింక్‌లో వదిలేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శుభ్రం చేయని గిన్నెలు ముఖ్యంగా రాత్రి సమయంలో సింక్ లో ఉంచడం వల్ల అనేక నష్టాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వండిన గిన్నెలు, తిన్న ప్లేట్లలో కొంత ఆహారం మిగిలిపోతుంది. వాటిని భోజనాలు , లేదా వంట పూర్తయి తర్వాత సింక్ లో పడేస్తుంటారు. రాత్రంతా గిన్నెలు శుభ్రం చేయకుండా ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగడానికి కావాల్సినంత సమయం లభిస్తుంది. అంతే కాకుండా వంట గదిలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ బ్యాక్టీరియా చేరే ప్రమాదం కూడా ఉంటుంది. వంట గిన్నెలతో పాటు కిచెన్ లో ఉండే ఇతర ఆహార పదార్థాలపై కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. మనం వీటిని ఉదయం పూట వాడటం వల్ల త్వరగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
జీర్ణ సమస్యలు:
జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి వంటగదిలో వ్యాపించిన బ్యాక్టీరియా కూడా కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి పూట పాత్రలన్నీ శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఎప్పటికప్పుడు గిన్నెలను శుభ్రం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అంతే కాకుండా వంట గది కూడా శుభ్రంగా ఉంటుంది.
ఉదయాన్నే శుభ్రం చేసినా.. :
రాత్రి పూట సింక్ లోనే గిన్నెలను వదిలేయడం ద్వారా ఈకోలి బ్యాక్టీరియా పెరుగుతుంది. సింక్‌లో తయారయిన ఈ బ్యాక్టీరియా వంట గది అంతటా వ్యాపించి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.
Also Read: గోధుమ పిండిలో ఈ 2 కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం
ఇలా చేస్తే.. కాస్త బెటర్ :
చాలా మంది టైమ్ లేదనో లేదా అలసిపోయామనో.. ఇంకేదైనా కారణాల వల్లనో రాత్రి పూట గిన్నెలను శుభ్రం చేయకుండా ఉంటారు. గంటల తరబడి సింక్ లోని వంట గిన్నెలను వదిలేస్తారు. ఇలా వండిన, తిన్న గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి వీలు కానప్పుడు కనీసం అందులో ఉన్న ఆహార పదార్థాలను అయినా డస్ట్ బిన్ లో పడేయండి. ఇలా చేయడం వల్ల కొంత మేరకు బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇలా చేస్తే.. మరుసటి రోజు కూడా పాత్రలను శుభ్రం చేయడానికి తక్కువ టైం పడుతుంది. గోరు వెచ్చటి నీటితో మురికి గిన్నెలను శుభ్రం చేయడం వల్ల అందులోని బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. లేదంటే.. వాష్ చేసిన గిన్నెలను వేడి నీటిలో కాసేపు ఉంచి తీసినా కూడా మంచిదే.